రేవంత్‌ రెడ్డిది ఎగవేతల ప్రభుత్వం

రేషన్‌ కార్డులు, ఆత్మీయ భరోసా పేదలకు అందకుండా కుట్రలు చేస్తోంది : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2025-01-18 18:38 IST

రేవంత్‌ రెడ్డిది ఎగవేతల ప్రభుత్వమని.. ఆరు గ్యారంటీలు సహా హామీలన్నీ ఎగవేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. జనవరి 26 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదు.. వాటిని ఎలా ఎగవేయాలన్నదే ఈ ప్రభుత్వం వ్యూహంగా కనిపిస్తుందన్నారు. శనివారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమను గెలిపిస్తే అందరికి పరమాన్నం పెడుతామని చెప్పి, అధికారంలోకి రాగానే పంగనామాలు పెడుతున్నడని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి అమలు కాలేదు, చివరి హామీ చేయూతకు దిక్కు లేదని మధ్యలో ఉన్న అన్ని హామీలదీ దాదాపు అదే పరిస్థితి అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్లు.. జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున ప్రారంభించే కార్యక్రమాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని ఇది చాలా దుర్మార్గమన్నారు. రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నామని తెలిపారు.




 

రేషన్‌ కార్డుల లబ్ధిదారుల ఎంపికపై ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉర్నారని.. పాపం రేవంత్ రెడ్డిది అయితే గ్రామాల్లోకి వెళ్తోన్న అధికారుకలు అది శాపంగా మారుతోందన్నారు. రేషన్ కార్డుల ఎంపిక గ్రామాల్లో జరగాలి కానీ కుల గణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి గ్రామాలకు పంపారని తెలిపారు. ప్రజాపాలనలో చేసుకున్న 11 లక్షల దరఖాస్తులకు తోడు, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులకు దిక్కేలేదన్నారు. తన నియోజకవర్గంలోని నంగునూరు, గట్లమల్యాలలో రేషన్‌ కార్డుల కోసం 110 మంది దరఖాస్తు చేసుకుంటే లిస్టులో 40 పేర్లు మాత్రమే ఉన్నాయని.. లిస్టు హైదరాబాద్‌ నుంచి వచ్చిందని అధికారులు చెప్తున్నారని తెలిపారు. రేషన్‌ కార్డులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొన్నదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పై గతంలో కాంగ్రెస్‌ రేషన్‌ కార్డులే ఇవ్వలేదని బురద జల్లిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6,47,479 కార్డులు ఇచ్చిందని, వాటి ద్వారా 20,69,033 మందికి రేషన్‌ సరఫరా చేశామని చెప్పారు. కేసీఆర్‌ మానవత దృక్పథంతో రేషన్‌ కార్డుల జారీలో నిబంధనలు కూడా సవరించారని గుర్తు చేశారు. అంగన్ వాడీలు, ఆశాలు, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, పేదలకు లాభం చేసేలా కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నరని తెలిపారు. ఎక్కువ మందికి లాభం చేయాలనేది బీఆర్‌ఎస్‌ విధానం అయితే.. ఎక్కువ మందికి కోతలు పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్‌ ది అన్నారు.

రేషన్‌ కార్డుల జారీకి ఇప్పుడున్న ఆదాయ పరిమితిని సవరించాలని డిమాండ్‌ చేశారు. అలా చేస్తేనే పేదలందరికీ లబ్ధి కలుగుతుందన్నారు. పదేళ్ల కిందటి నిబంధనలతోనే ఇప్పుడు రేషన్‌ కార్డులు ఇస్తామనే ఆలోచనే మంచిది కాదన్నారు. పేదలకు రేషన్‌ కార్డులను దూరం చేసేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందన్నారు. పేదలకు లాభం చేయాలన్న లక్ష్యంతోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఒక్కొక్కరికి ఇచ్చే రేషన్‌ పరిమితిని 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచామని, కుటుంబానికి 20 కేజీల సీలింగ్‌ ఉంటే.. దానిని ఎంత మంది ఉంటే అందరికి రేషన్‌ ఇవ్వాలని మార్చామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టామని తెలిపారు. 28వ తేదీ నుంచి నిర్వహించే గ్రామ సభల్లో ప్రజలు రేషన్‌ కార్డుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇచ్చే వరకు బీఆర్‌ఎస్‌ వారి తరపున పోరాడుతుందన్నారు. రేషన్‌ కార్డుల అర్హుల జాబితాలో పేర్లు లేవంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారని, ఇప్పటికే మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకున్నారు.. ప్రజాపాలనలో దరఖాస్తు చేశారు.. ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేయాలని నిలదీశారు.

ఉపాధి హామీలో పని చేసేవాళ్లే వ్యవసాయ కూలీలంటే ఎలాగని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.04 కోట్ల మంది కూలీలు ఉన్నారని.. కనీసం ఉపాధి హామీలో 20 రోజుల పని చేయాలనే నిబంధనతో వారి సంఖ్య 25 లక్షలకు తగ్గిందన్నారు. వారిలో వ్యవసాయ భూములు ఉన్నోళ్లను తీసేస్తే 6 లక్షల మందికి తగ్గిపోయిందన్నారు. గుంట భూమి ఉన్న వాళ్లకు కూడా ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇవ్వమని ఈ ప్రభుత్వం చెప్తుందన్నారు. అంటే 94 శాతం మంది కూలీలకు ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. గ్రామాల్లో కూలీ పనులు చేసేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని తెలిపారు. వాళ్ల నోరు కొట్టడానికి ఈ ప్రభుత్వానికి చేతులెట్లా వచ్చాయో చెప్పాలన్నారు. పంట రుణం మాఫీ కాక ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం సైదాపూర్‌ లో గిరిజన రైతు బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని.. రేవంత్‌ రెడ్డి మోసం చేయడంతోనే ఆ రైతు ప్రాణం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు అందరికీ రూ.5 లక్షలే ఇస్తామని ప్రభుత్వం చెప్తోందన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష ఎగవేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయని రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి పోయి గొప్పలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. 55 వేల ఉద్యోగాల భర్తీ చేశామని సీఎం అంటున్నారని.. అందులో 44 వేల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతోనే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వలేకపోయామన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, సీనియర్‌ నాయకుడు దేవిప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags:    
Advertisement

Similar News