తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్‌కు కారణం రోశయ్యే
ఆయన నిబద్ధత, సమర్థత వల్లనే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిందన్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడింది. రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లనే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోశయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్య చేతుల్లో ఉన్నదన్నారు. తెలంగాణను మరింత అగ్రభాగాన నిలపడానికి వారు మరింత సహకారాన్ని అందించాలని కోరారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచిన రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు.
నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోశయ్య నన్ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని విలువైన సూచనలు చేశారు. బాగా మాట్లాడుతున్నావు.. మరింత అధ్యయనం చేసి సభకు రావాలని చెప్పారు. ప్రతిపక్షం తప్పకుండా ప్రశ్నించాలని, పాలకపక్షం ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు మేలు కలిగేలా అధికారపక్షాన్ని నిలదీయాలన్నారు. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేశారని సీఎం తెలిపారు. ఆయన పట్టుదల, మాటల్లో చతురత ఎంతో ముఖ్యమైనవన్నారు. పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను, ప్రతిపక్షంలో ఉంటే సీఎంగా ఉన్న వ్యక్తిని ఇరుకునపెట్టే విధానాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీఎంలుగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, భవనం వెంకట్రామ్, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇలాంటి వాళ్లంతా ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపించగలిగారు అంటే కారణం రోశయ్యే అన్నారు. సమస్యలను పరిష్కరించానికి వారికి కుడిభుజంలా ఆయన వ్యవహరించేవారు. అందుకే అప్పట్లో ఎవరు సీఎంలుగా ఉన్నా నంబర్ 2 పొజిషన్ పర్మినెంట్. నంబర్1 పొజిషన్ మాత్రమే మారుతుండేదన్నారు. ఎవరు సీఎం అయినా.. నంబర్ 2లో రోశయ్యే ఉండాలని కోరుకునేవారని రేవంత్ గుర్తుచేశారు. తెలంగాణ శాసనసభలో ఆయనలా వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే నేతల లేకపోవడం లోటుగా కనిపిస్తుందన్నారు.