మోడీ దూకుడైన స్పీచ్.. అసలు కారణం ఇదేనా?
బేగంపేటలో బీజేపీ శ్రేణులతో మాట్లాడిన సమయంలో, రామగుండం బహిరంగ సభలో మోడీ తన శైలికి భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల పర్యటన ముగిసింది. ఏపీలో తన మూస ప్రసంగాన్ని కొనసాగించిన మోడీ.. తెలంగాణలో మాత్రం రూటు మార్చారు. ఎన్నడూ లేనంతగా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విరుచుకపడ్డారు. తెలంగాణ సర్కారును కూలదోస్తాం అని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. సింగరేణి విషయంలో టీఆర్ఎస్ చేస్తున్నవన్నీ అబద్దాలే అని చెప్పుకొచ్చారు. గతంలో హైదరాబాద్ పర్యటనలో మోడీ ఎప్పుడూ ఇంత దూకుడైనా స్పీచ్ ఇవ్వలేదు. బేగంపేటలో బీజేపీ శ్రేణులతో మాట్లాడిన సమయంలో, రామగుండం బహిరంగ సభలో మోడీ తన శైలికి భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోడీ సహా పార్టీ అగ్రనాయకత్వం హాజరైంది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ పలు ప్రశ్నలు అడిగారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందని నేరుగానే ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరారు. కానీ, ఆ రోజు మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తావన లేకుండానే ప్రసంగాన్ని ముగించారు. కానీ శనివారం మాత్రం దూకుడుగా మాట్లాడారు. నేరుగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామనే మాట కూడా వాడారు. దీని వెనుక మునుగోడు ఓటమి, ఫామ్‌హౌస్ ఘటన ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.
మునుగోడు ఉపఎన్నిక తప్పక గెలుస్తామని బీజేపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. బొటాబొటి మెజార్టీతో అయినా గెలుస్తామనే నమ్మకం ఉండేది. కానీ చివరకు టీఆర్ఎస్ పార్టీ పది వేల మెజార్టీతో గెలిచింది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ నాయకత్వం స్కెచ్ వేసింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిపిన బేరసారాలను టీఆర్ఎస్ స్వయంగా బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం అయ్యింది. అంతే కాకుండా బీజేపీ అగ్రనేతల పేర్లు ఈ కొనుగోళ్ల వ్యవహారంలో బయటకు వచ్చాయి. అమిత్ షా కూడా దీని వెనుక ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర బీజేపీని పక్కన పెట్టి మరీ కేంద్ర నాయకత్వం ఈ వ్యవహారం నడిపినట్లు తెలిసింది.
ఈ రెండు ఘటనలు బీజేపీ శ్రేణులను డీలా పరిచాయి. టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈ విషయాలను గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తుండటంతో బీజేపీ నాయకులు సరైన విధంగా రెస్పాండ్ కాలేకపోతున్నారు. నిన్న మొన్నటి వరకు దుబ్బాక, హుజూరాబాద్ విజయాలను ఉటంకిస్తూ బీజేపీ నేతలు రెచ్చిపోయే వారు. కానీ ఇప్పుడు వారికి తాజా పరిణామాలు ఇబ్బందిగా మారాయి. అందుకే రాష్ట్ర బీజేపీని ఉత్సాహపరిచేందుకే మోడీ అలా మాట్లాడారని విశ్లేషకులు అంటున్నారు.
డీలా పడిన బీజేపీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపడానికే.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తాం, సింగరేణి ప్రైవేటీకరణ లేదు అనే మాటలు మాట్లాడారని భావిస్తున్నారు. బేగంపేటలో బీజేపీ కార్యకర్తలతో భేటీ కావడానికి ముఖ్య కారణం కూడా ఇదే అని తెలుస్తున్నది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన కీలక నేతలు కూడా పార్టీని వీడిపోతుండటం మరో కారణం. బీజేపీలో నిస్తేజం ఆవహిస్తే టీఆర్ఎస్‌కు వలసలు పెరిగిపోతాయని జాతీయ నాయకత్వం అంచనా వేసింది. అందుకే మోడీతో కాస్త దూకుడైన మాటలు మాట్లాడించినట్లు తెలుస్తున్నది. అమిత్ షా, జేపీ నడ్డా మాట్లాడటం కంటే ప్రధాని మోడీ మాట్లాడితే బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని.. అందుకే ఏనాడూ నేరుగా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయని మోడీ అలా మాట్లాడారని అనుకుంటున్నారు.
మోడీ మాటలు టీఆర్ఎస్ నాయకులకు సూటిగా తగిలినా, తగలకున్నా.. తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడంలో మాత్రం కాస్త సక్సెస్ అయ్యాయి. రేపో మాపో మోడీ చేసిన ఆరోపణలన్నింటికీ టీఆర్ఎస్ నుంచి తప్పకుండా కౌంటర్ వస్తుంది. స్వయంగా కేసీఆర్.. మోడీ ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం ఉన్నది. సింగరేణి విషయంలో బీజేపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను కూడా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.