నన్ను ఎంత తిడితే అంత శక్తివంతుడిని అవుతాను -మోడీ

ప్రధాని మోడీ తెలంగాణ‌ పర్యటన సందర్భంగా టీఆరెస్ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో, దేశంలోని దుష్ట శక్తులన్నీ తనకు వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని ఆరోపించారు.

Advertisement
Update:2022-11-12 14:20 IST

ఈ దేశంలో, తెలంగాణలో కొన్ని రాజకీయ పక్షాలు తనను ప్రతి రోజూ తిడుతూ ఉంటాయని, వాళ్ళెంత తిడితే తాను అంత శక్తివంతమవుతానని ప్రధాని మోడీ అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చిన మోడీ బేగంపేట ఏయిర్ పోర్ట్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఉపన్యాసమంతా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకపడ్డారు.

భారత్ మాతాకు జై అని ఉపన్యాసం మొదలు పెట్టిన ప్రధాని ''నేను మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. తెలంగాణ కార్యకర్తలనుండి నేను తీవ్ర ప్రభావితం అయ్యాను. భారత్ కోసం మీరు చేస్తున్న కృషి గొప్పది. ఇక్కడి సర్కార్ మీపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నప్పటికీ మీరు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్నారు.'' అని మోడీ అన్నారు.

''తెలంగాణ పేరుతో వాళ్ళు లాభపడ్డారు. కాని తెలంగాణను మాత్రం వెనక్కి నెట్టారు. వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు వారిని చాలా నమ్మారు కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఎక్కడ చీకటి అలుముకుంటుందో అక్కడ కమల్ పుష్పించడం మొదలవుతోంది. అక్కడ కమలం వెలుగులను వెదజల్లుతుంది'' అని మోడీ టీఆరెస్ పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు.

''మునుగోడు ప్రజలు బీజేపీపై చూపిన‌ ఆధరాభినాలు గొప్పవి. వాళ్ళ పార్టీ మొత్తాన్ని ఒక్క నియోజకవర్గానికి తెచ్చి కూర్చోపెట్టారు. ఇది ప్రజలకు మనపై ఎంత నమ్మకం ఉందో తెలియజేస్తుంది. తెలంగాణలోని ప్రతి ఎన్నికలో ఇదే జరుగుతోంది. తెలంగాణలో సూర్యోదయం ఇక ఏంతో దూరంలో లేదు చీకటి తొలిగిపోతుంది. ''

''బీజేపీకి తెలంగాణ మొదటి నుంచి అండగా ఉంది. 1984 లో దేశం మొత్త‍లో బీజేపీ ఓడిపోయి 2 సీట్లలో మాత్రమే గెలిచినప్పుడు అందులో ఒకటి తెలంగాణలోని హన్మకొండది. కష్ట‌కాలంలో తెలంగాణ మనను వదల లేదు. తెలంగాణ‌లో ప్రజలు బీజేపీ ని అతిపెద్ద పార్టీగా చేయడానికి సిద్దమయ్యారు. '' అని అన్నారు మోడీ

''ఇది ఆధునిక రాష్ట్రం, టెక్నాలజీ పరుగులు పెడుతున్న రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో అంధవిశ్వాసాలు పెంపొందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి వర్గంలో ఎవరిని ఉంచాలి, ఎప్పుడు చేర్చుకోవాలనేది కూడా మూఢ విశ్వాసాల ఆధారంగా నిర్ణయం జరుగుతోంది. ఇలాంటి అంధ విశ్వాసాల నుంచి రాష్ట్రాన్ని దూరం చేయాలి. '' అని మోడీ అన్నారు.

తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను. పేదలను దోపిడి చేసే వాళ్ళను వదిలిపెట్టను.కొంత మంది తమపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.అవినీతి, కుటుంబ పాలన‌ ప్రజలకు శత్రువులు. అందుకే ఈ రెండింటికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోంది. అందుకే మాకు వ్యతిరేకంగా దేశంలో దుష్ట శక్తులన్నీ ఏకమవుతున్నాయి.తెలంగాణలో మేము అవినీతి రహిత పాలన అందిస్తాము. కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్ళండి కేంద్ర సర్కార్ పథకాలు చెప్పండి, వాటిని వారికి అందేట్టు చేయండి.

''కొందరు వాళ్ళకున్న నిరాశ కారణంగా, మూఢనమ్మకాల కారణంగా మోడీని, బీజేపీని ఎప్పుడూ తిడుతూ ఉంటారు. వాటిని విని మీరు బాధపడకండి. వాళ్ళ దగ్గర తిట్లు మినహా మరేమీ మిగల లేదు అందుకే తిడుతున్నారు. వాటిని పట్టించుకోకండి. పోరాటం కొనసాగించండి'' అని మోడీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

నేను రోజూ రెండు, రెండున్నర కిలోల తిట్లు తింటాను. అవి నన్ను శక్తివంతుణ్ణి చేస్తాయి. నన్ను తిట్టండి, బీజేపీని తిట్టండి కానీ తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇక్కడి ప్ర‌జల కలలతో ఆడుకుంటే ఊరుకునేది లేదు. '' అని మోడీ హెచ్చరించారు.

నన్ను తిట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు మంచి జరిగితే తిట్టండి. రైతులకు మంచి జరిగితే తిట్టండి.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు మమ్ములను అధికారంలోకి తెస్తారు. మేము తెలంగాణను అభివృద్ది చేస్తాము.ఎక్కడైనా ఒక సారి బీజేపీ సర్కార్ వస్తే ఇక పోదు. ప్రతీ సారి మేమే గెలుస్తాం అని మోడీ భరోసా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News