రామప్ప ఆలయాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌ రావు

Advertisement
Update:2024-09-26 16:34 IST

చారిత్రక రామప్ప దేవాలయాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌ రావు ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌ లో పార్టీ నాయకుడు వాసుదేవ రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ప్రతాప రుద్రుడు 800 ఏళ్ల క్రితం రామప్ప ఆలయాన్ని నిర్మించారని, ఉమ్మడి ఏపీలో నిర్లక్ష్యానికి గురైన ఆలయం కేసీఆర్‌ ప్రభుత్వంలో 2021లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు నిక్షేపాలు వెలికి తీసేందుకు రహస్యంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. అక్కడ ఓపెన్‌ కాస్ట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో రామప్ప గుడికి పెనుముప్పు వాటిల్లబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కేసీఆర్‌ గట్టిగా వ్యతిరేకించారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ ఆలయం నుంచి కేవలం నాలుగున్నర కి.మీ.ల దూరంలో ఉందని తెలిపారు. అక్కడ బొగ్గు గని ఏర్పాటు చేస్తే రామప్ప ఆలయానికి ఇచ్చిన యునెస్కో గుర్తింపు రద్దవుతుందని, ఇది దేశానికే చెడ్డపేరు తీసుకువస్తుందన్నారు. సాండ్‌ ఫిల్లింగ్‌ టెక్నాలజీతో నిర్మించిన రామప్పను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రామప్ప ఆలయాన్ని రక్షించుకోవడానికి బీఆర్‌ఎస్‌ తరపున కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో సీతక్క రామప్ప దగ్గర ఓపెన్‌ కాస్ట్‌ ను వ్యతిరేకించారని, ఇప్పుడు మంత్రి అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సొంత సంపద పెంచుకునేందుకు ప్రపంచ వారసత్వ సంపదను ఫణంగా పెట్టే ప్రయత్నాలను రేవంత్‌ విరమించుకోవాలన్నారు. ఢిల్లీ సుల్తానులు దాడులు చేసినా రామప్ప దేవాలయం, చెరువు జోలికి వెళ్లలేదని.. రేవంత్‌ సర్కార్‌ పాలన ఢిల్లీ సుల్తాన్‌ల కన్నా అధ్వనంగా మారుతోందని మండిపడ్డారు. వరంగల్‌ పోరాటాల గడ్డ అని.. వరంగల్‌ జోలికి రావొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తన ప్రయత్నాలు విరమించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రతిఘటించి తీరుతామన్నారు.

Tags:    
Advertisement

Similar News