దేశంలో తొలి ట్రావెలింగ్ ఫొటో గ్యాలరీ.. టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 'టైగర్ ఫొటో ఎగ్జిబిషన్'
దేశంలో పులుల సంరక్షణ, వాటిని సంఖ్యను పెంపొందించేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్ల పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతలో భాగంగా టీఎస్ఆర్టీసీ హైదరాబాద్‌లో పులుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించింది.
దేశంలోనే ఉత్తమ రోడ్డు రవాణా సంస్థగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ).. ఎప్పటికప్పుడు తమ సేవలను మెరుగు పరుస్తోంది. కేవలం ప్రయాణికుల సేవకే కాకుండా.. ఇప్పుడు వినూత్న కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలి ట్రావెలింగ్ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ.. వివిధ రకాలైన ఫొటోలను, పలు చోట్ల ప్రదర్శిస్తోంది. తాజాగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో పులులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
దేశంలో పులుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంపొందించేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ టైగర్' 50 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతలో భాగంగా టీఎస్ఆర్టీసీ హైదరాబాద్‌లో పులుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించింది. ఐసీబీఎం అడకడమిక్ డీన్, ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ జితేందర్ గోవిందానీ తీసిన పులి ఫొటోలను టీఎస్ఆర్టీసీ ప్రదర్శనకు పెట్టింది. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాల్లో ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుందని.. రోజుకో చోటు బస్సును ఆపుతామని టీఎస్ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. పులుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్‌ను టీఎస్ఆర్టీసీ సహకారంతో ఎర్పాటు చేసినట్లు రాకేశ్ మోహన్ డోబ్రియాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ కన్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రెండు పులుల సంరక్షణ కేంద్రాల్లో దాదాపు 30 పులులు ఉన్నాయని చెప్పారు.
అడవుల్లో నివసించే పులుల కారణంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని, పులుల ఆవాసాలు ఉండే చోట మంచి వాతావరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో సమస్త జీవరాశుల మనుగడకు పులులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తాయని డోబ్రియాల్ వివరించారు.
పులులను రక్షించడం అంటే అడవులను రక్షించి, జీవ వైవిధ్యాన్ని కాపాడటమే అని వీసీ సజ్జనార్ అన్నారు. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌లో తాను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పులులను సంరక్షించడం మనందరి బాధ్యత అని సజ్జనార్ పేర్కొన్నారు.ఫొటోగ్రఫీ చాలా ఎఫెక్టీవ్ మీడియా అని.. ఫొటోలు, విజువల్స్ ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. ఈ ఫొటోగ్రఫీ ద్వారా పులుల ప్రాధాన్యతను వివరించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రజా రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అని తెలిపారు.