ఆ నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ నిఘా.. కారణం ఏంటంటే?

త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టనున్నది.

Advertisement
Update:2023-09-29 08:08 IST

మరో వారం పది రోజుల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శాంతి భద్రతలు, ఇతర సమస్యలపై విస్తృత కసరత్తు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు గుర్తించింది. అందుకే త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టనున్నది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోట్లాది రూపాయల వ్యయం చేసే అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించనున్నారు. గత ఎన్నికల్లో భారీగా నిధులు వెచ్చించినవి.. అదే స్థాయిలో ఖర్చు చేసిన సెగ్మెంట్ల జాబితాను సిద్ధం చేస్తోంది. పోలీస్, ఆదాయపన్ను శాఖతో కలిసి ఈ మేరకు సంయుక్త అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చెల్, నల్గొండ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సారి కూడా ఆయా నియోజకవర్గాల్లో భారీగా ఖర్చు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, ఇతర బహుమతుల విలువే దాదాపు రూ.100 కోట్లుగా ఉన్నది. ఇక ఇటీవల జరిగిన మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. ఈ సారి ఇలాంటి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో జాబితా సిద్ధం చేయనున్నారు. విచ్చల విడి వ్యయానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సహాయంతో భారీ ఖర్చుకు కళ్లెం వేయాలని భావిస్తోంది.

మరోవైపు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలను కూడా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణకు ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. వీటిలో ఛత్తీస్‌గడ్ సరిహద్దులో మావోయిస్టుల కదలికలు ఉన్నాయి. 2018లో ఈ రాష్ట్ర సరిహద్దులోని 13 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఈ సారి కూడా ఆయా నియోజకవర్గాల పరిస్థితి అంచనా వేయనున్నారు. రాష్ట్రంలో గొడవలు, అల్లర్లు, ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న సెగ్మెంట్లు, పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News