107 మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన 72 మందిపై కూడా వేటు వేసింది.

Advertisement
Update:2023-10-21 07:41 IST

తెలంగాణ నుంచి గతంలో లోక్‌సభ, అసెంబ్లీలకు పోటీ చేసిన వారిని తిరిగి పోటీ చేయడానికి అనర్హులుగా తేల్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 వరకు వీరిపై అనర్హత వేటు కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు.. ఆయా ఎన్నికలకు సంబంధించిన వ్యయ వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు అందజేయలేదు. దీంతో వారిపై అనర్హత వేటు వేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో సదరు అభ్యర్థులు తిరిగి పోటీ చేయడానికి ప్రయత్నిస్తే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో జుక్కల్, ములుగు, రామగుండం, పాలకుర్తి, కరీంనగర్, జనగామ, డోర్నకల్, గజ్వేల్, మల్కాజ్‌గిరి, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన 35 మంది ఎన్నికల వ్యయ నివేదికలు ఇవ్వలేదు. దీంతో వారు 2024 వరకు పోటీకి అనర్హులుగా ప్రకటించింది.

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన 72 మందిపై కూడా వేటు వేసింది. వీరీలో 68 మంది ఒక్క నిజామాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేయడం గమనార్హం. పసుపు బోర్డు, ఇతర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలనే ఉద్దేశంలో ఆ నియోజకవర్గం నుంచి 186 మంది పోటీ చేశారు. ఇందులో అత్యధిక శాతం మంది సామాన్య రైతులే ఉన్నారు. దీంతో పాటు మెదక్, మహబూబాబాద్ నుంచి ఒక్కో స్వతంత్ర అభ్యర్థి, నల్గొండ నుంచి ఇద్దరిని అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. 

Tags:    
Advertisement

Similar News