తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తొలిసారి అధికారికంగా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. తొలిసారిగా అవతరణ దినోత్సవం రోజున వేడుకలు జరపాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచిపోయి పదో ఏట అడుగు పెట్టబోతున్నా.. ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అవతరణ ఉత్సవాలు చేసిందే లేదు. నాలుగేళ్ల క్రితం స్వయంగా ప్రధాని మోడీనే 'తల్లిని చంపి బిడ్డను బతికించారు' అని తెలంగాణ ఏర్పాటుపై అవమానకరంగా మాట్లాడారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు కేటాయింపులో బీజేపీ ప్రభుత్వం పూర్తి వివక్ష చూపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నో మార్లు సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఇంత వరకు స్పందించలేదు. తెలంగాణకు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకొని పోయారు. ఇలా గత 9 ఏళ్లుగా తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపించింది.
అయితే, తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు గ్రామగ్రామాన చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో షెడ్యూల్ నిర్ణయించిన ప్రభుత్వం.. రేపటి నుంచి ఉత్సవాల నిర్వహణను ప్రారంభించనున్నది. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అధికారికంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. గోల్కొండ కోట వేదికగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. తొలిసారిగా అవతరణ దినోత్సవం రోజున వేడుకలు జరపాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వానికి పోటీగానే కేంద్రం ఈ వేడుకలు నిర్వహిస్తోందనే చర్చ జరుగుతోంది. రెండు రోజుల పాటు గోల్కొండ కోటలో ఈ వేడుకలు జరుగనున్నాయి.
జూన్ 2న ఉదయం 6.30 గంటలకు గోల్కొండ ఖిల్లాపై జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఎగురవేస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 3న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విశేషాలను వివరించే కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. బీజేపీకి చెందిన జాతీయ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
గోల్కొండ ఖిలా వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు మంజుల రామస్వామి అండ్ గ్రూప్, ఆనంద శంకర్ అండ్ గ్రూప్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, సింగర్స్ మంగ్లి, మధుప్రియ తమ పాటలతో అలరించనున్నారు. ఇక విద్యార్థులకు 'ఖిలా ఔర్ కహానీ' పేరుతో ఫొటో, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. అక్కడే తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలిపే ఫొటో, పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు గోల్కొండ కోటను సందర్శించనున్నారు.