బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వని బీజేపీ అధిష్టానం!

ప్రజా సంగ్రామ యాత్రను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని బండి సంజయ్ అధిష్టానాన్ని కోరారు. కానీ అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు.

Advertisement
Update:2023-05-24 12:18 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఐదు విడతల పాదయాత్ర గతేడాది డిసెంబర్‌లో కరీంనగర్‌లో ముగిసింది. ఆ తర్వాత ఆరో విడత యాత్రను కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు చేపట్టాలని భావించారు. అప్పట్లో అధిష్టానం కూడా ఓకే చెప్పింది. కానీ ప్రజా సంగ్రామ యాత్ర అర్థాంతరంగా ముగిసినట్లు పార్టీ వర్గాలు చెప్పారు. బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్ర గురించి బయట ఎక్కువగా మాట్లాడటం లేదు.

తాజాగా ప్రజా సంగ్రామ యాత్రను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని బండి సంజయ్ అధిష్టానాన్ని కోరారు. కానీ అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో సంజయ్‌ యాత్ర ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. గత సోమవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశం నిర్వహించారు. నెల రోజుల పాటు బీజేపీ నాయకులు క్షేత్ర స్థాయిలో పని చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. ప్రతీ ఒక్కరు నియోజకవర్గాల్లో తిరగాలని ఆదేశించారు.

ఒకవైపు బీజేపీ నాయకులను క్షేత్ర స్థాయిలో తిరుగుతూ.. ప్రజలతో మమేకం అవ్వాలని అధిష్టానం చెబుతూ.. అదే సమయంలో పాదయాత్రకు మాత్రం అనుమతులు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ వర్గానికి, కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ సమయంలో పాదయాత్రకు అనుమతి ఇస్తే.. మరో వర్గం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. అందుకే బండి కోరినా ఇప్పటి వరకు పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తున్నది.

తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే, ఆ పాదయాత్ర వల్ల పెద్దగా మైలేజ్ రావడం లేదని.. పైగా బండి చేసే వ్యాఖ్యలతో పార్టీకే నష్టం కలుగుతున్నట్లు అధిష్టానానికి నివేదిక అందింది. బండికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కూడా ఇదొక కారణమని తెలిసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు.. పాదయాత్రను కంప్లీట్ చేయడానికి బండి సంజయ్ తనకున్న పరిచయాల ద్వారా అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక వేళ బీజేపీ అగ్రనాయకత్వం ఓకే చెబితే.. రెండు విడతల్లో పాదయాత్ర పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

Tags:    
Advertisement

Similar News