ఎమ్మెల్యేగా పోటీ చేసే వయసు 21 ఏళ్లకు కుదించాలి
చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో తీర్మానం
ఎమ్మెల్యేగా పోటీ చేసే వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో తీర్మానించారు. గురువారం చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎస్‌సీఈఆర్‌టీ లో చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సమావేశాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. చట్టసభల్లో సభా నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సమాన అవకాశాలు ఉంటాయన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రశ్నలు, వాటికిచ్చే సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అన్నారు. సభను సమర్థంగా నడిపించే బాధ్యత స్పీకర్ పై ఉంటుందన్నారు. ఇప్పుడు కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తెచ్చిన ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తోనే సమాజంలో ఈరోజు ఇలాంటి అవకాశాలు వచ్చాయన్నారు. నిర్బంధ విద్య అమలు కోసం సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ కృషి చేశారని, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే 25 ఏళ్ల వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని ఈ సభలో తీర్మానం చేయడం అభినందనీయమన్నారు.