'అట్లుంటది కేసీఆర్ దెబ్బ'...విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం గురించి కేటీఆర్ వ్యాఖ్య
స్టీల్ ప్లాంట్ ను వేలం వేసేందుకు కేంద్రం సిద్ధమయితే తామూ బిడ్ వేస్తామని చెప్పిన కేసీఆర్, ప్లాంట్ పరిశీలన కోసం సింగరేణి అధికారులను పంపారని, అది జరిగిన ఒక్క రోజులోనే కేంద్రం యూ టర్న్ తీసుకుందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని ఆయన తెలిపారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కేంద్ర ఉక్కుగనుల సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ''అట్లుంటది కేసీఆర్ దెబ్బ'' అని ఆయన వ్యాఖ్యానించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చాలా కాలంగా పోరాడుతున్నదని, ప్రైవేటీకరణ జరగనివ్వబోమని కేసీఆర్ చాలాసార్లు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ ను వేలం వేసేందుకు కేంద్రం సిద్ధమయితే తామూ బిడ్ వేస్తామని చెప్పిన కేసీఆర్, ప్లాంట్ పరిశీలన కోసం సింగరేణి అధికారులను పంపారని, అది జరిగిన ఒక్క రోజులోనే కేంద్రం యూటర్న్ తీసుకుందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని ఆయన తెలిపారు.
మరో వైపు ఏపీ బీఆర్ఎస్ నేతలు కూడా కేంద్ర మంత్రి ప్రకటన పై హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏపీలో బీఆర్ఎస్ మొదటి విజయమని నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు అన్నారు. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు చేయలేని పనిని బీఆర్ఎస్ చేసి చూపించిందని వారు వ్యాఖ్యానించారు.