థ్యాంక్యూ బింకూ.. తండ్రిగా గర్వపడుతున్న
హిమాన్షు పాడిన పాటను రిలీజ్ చేసిన కేటీఆర్
థ్యాంక్యూ బింకూ.. తండ్రిగా గర్వపడుతున్నా.. అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది జూలైలో తన బర్త్ డే సందర్భంగా తన తనయుడు హిమాన్షు పాడిన పాటను రిలీజ్ చేశారు. తన కోసం హిమాన్షు పాడిన పాట.. హిమాన్షు గొంతు నచ్చాయని తండ్రిగా మురిసిపోయారు. అత్యంత కష్టమైన సంవత్సరంలో తనకు దక్కిన బెస్ట్ గిఫ్ట్ ఇది అని పేర్కొన్నారు. జూలైలోనే హిమాన్షు ఈ పాటను రికార్డింగ్ చేసినా అది సరిపోదేమోనని అప్పుడు రిలీజ్ చేయలేదని తెలిపారు. వారం క్రితమే హిమాన్షు తన కోసం పాడిన పాటను మొదటిసారి విన్నానని.. తండ్రిగా ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు. యానిమల్ సినిమాలోని ''నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే.. నా కన్నులకు నువు వెన్నలవి.. నా ఊపిరివి నువ్వే.. నువ్వే కదా.. నువ్వే కదా.. సితార నా కలకు.. నాన్నా నువు నా ప్రాణం అనిన..'' అనే పాటను హిమాన్షు రికార్డింగ్ చేశారు. తన తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, తాతనాన్నమ్మ కేసీఆర్, శోభమ్మ, సోదరి అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులతో తన చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు దిగిన వివిధ ఫొటోలను ఈ లిరికల్ వీడియో సాంగ్ కు జత చేశాడు. ఈ పాటను కేటీఆర్ పోస్ట్ చేసిన అర గంటలోనే 20 వేల మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. పలువురు రీ ట్వీట్ చేశారు.