జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..పెట్రోల్ పోసుకున్న కాంట్రాక్టర్లు
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడాదిగా బిల్లులు చెల్లించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఉన్నట్టుండి ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
తోటి కాంట్రాక్టర్లు వారిని అడ్డుకుని పెట్రోల్ బాటిళ్లను లాగేసుకున్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి.. కాంట్రాక్టర్లను చర్చలకు పిలిచారు. పెండింగ్ బిల్లులపై కమిషనర్ ఇలంబర్తి.. కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల ఆందోళనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.