వీఆర్ఏల సర్దుబాటులో తొలి అడుగు
ప్రాజెక్టులు, కాలువలు, చెరువులకు సంబంధించి గేట్లు, షట్టర్లు, తూముల నిర్వహణలో లష్కర్లు కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. మిగతా వీఆర్ఏ లను కూడా త్వరలోనే ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేస్తారు.
రెవెన్యూ శాఖలోని వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలంటూ ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని సబ్ కమిటీ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. 21వేలమంది వీఆర్ఏల నుంచి 5950మందిని నీటిపారుదల శాఖలోకి సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నీటిపారుదల శాఖలో లష్కర్లుగా వారిని నియమించబోతోంది.
లష్కర్ల సేవలు అత్యవసరం..
తెలంగాణ ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్ట్ లతో కళకళలాడుతోంది. అయితే ఆ నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు, నీటి పారుదలపై పర్యవేక్షణకోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు అవసరమవుతారు. సరిగ్గా ఇదే సమయంలో వీఆర్ఏల సర్దుబాటు అంశం కూడా కలిసొచ్చింది. దీంతో వీఆర్ఏలను లష్కర్లుగా ఉపయోగించుకోబోతున్నారు.
ప్రాజెక్ట్ ల నుంచి నీరు వృథా పోకుండా ఇప్పటికే టెయిల్ ఎండ్, వారబంది విధానాలు అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. నీటి నిర్వహణకు ప్రత్యేకంగా ఆపరేషన్స్ అండ్ మేనేజ్ మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేసి ఇంజినీర్ ఇన్ చీఫ్ ను కూడా నియమించింది. ఇప్పుడు ఆ విభాగంలో ప్రాజెక్టుల నిర్వహణకు లష్కర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులకు సంబంధించి గేట్లు, షట్టర్లు, తూముల నిర్వహణలో లష్కర్లు కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. మిగతా వీఆర్ఏ లను కూడా త్వరలోనే ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేస్తారు.