యూ టర్న్ తీసుకున్న కేంద్రం...ఈ సారి రబీ ధాన్యం సేకరణలో కీలకంగా మారిన తెలంగాణ

తెలంగాణ రైతులనుండి ధాన్యం కొనడానికి ససేమిరా అన్న కేంద్ర‍ ఇప్పుడు మాత్రం తెలంగాణవైపే చూస్తోంది. యాసంగి (రబీ) సీజన్ లో దేశంలో వరి ధాన్యం ఉత్పత్తి తగ్గడంతో కేంద్రం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల మీదనే ఆధారపడాల్సి వస్తోంది.

Advertisement
Update:2022-11-27 10:13 IST

కొంత కాలంగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ రైతులనుండి ధాన్యం కొనడానికి ససేమిరా అన్న కేంద్ర‍ ఇప్పుడు మాత్రం తెలంగాణపైనే ఆధారపడాల్సి వచ్చింది. యాసంగి (రబీ) సీజన్ లో దేశంలో వరి ధాన్యం ఉత్పత్తి తగ్గడంతో కేంద్రం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల మీదనే ఆధారపడాల్సి వస్తోంది.

జాతీయ స్థాయిలో, ఈ సంవత్సరం ఖరీఫ్ (వానకాలం) సమయంలో దాదాపు 403 లక్షల హెక్టార్లలో (995 లక్షల ఎకరాలు) వరి సాగు చేపట్టారు. గతేడాది 423 లక్షల హెక్టార్ల (1,045 లక్షల ఎకరాలు)తో పోలిస్తే ఇది 20 లక్షల హెక్టార్లు (49 లక్షల ఎకరాలు) తక్కువ. ఆలస్యమైన రుతుపవనాలు,అస్థిర వర్షాల కారణంగా అనేక రాష్ట్రాల్లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి రెండూ దెబ్బతిన్నాయి.

ఈ సారి గతేడాది కంటే దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 2021-22లో వరి ధాన్యం ఉత్పత్తి 11.2 కోట్ల టన్నులుగా నమోదు కాగా, ఇటీవల ముగిసిన ఖరీఫ్ సీజన్‌లో ఇది దాదాపు 10.5 కోట్ల టన్నులుగా ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఒడిశా వంటి రాష్ట్రాలతో పాటు తెలంగాణ వైపు మొగ్గు చూపుతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ల‌లో యాసంగి సీజన్‌లో కూడా వరి సాగు చేస్తారు.

"ఈ రాష్ట్రాల్లో వరి సాగులో అత్యధిక విస్తీర్ణం తెలంగాణలోనే ఉంది. 2021-22 యాసంగిలో తెలంగాణలో దాదాపు 34.21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది మరో ఐదు లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది.'' అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

2022-23వానాకాలం సమయంలో, తెలంగాణలో దాదాపు 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీని ఫలితంగా 1.41 కోట్ల టన్నుల ఉత్పత్తిని అంచనా వేశారు. ఇందులో దాదాపు 90 లక్షల టన్నులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. శుక్రవారం నాటికి 28 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశారు.

గత ఏడాది యాసంగిలో తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అయితే ఇప్పుడు కేంద్రం యూ ​​టర్న్ తీసుకుని ఈ ఏడాది జులైలో యాసంగి నిల్వల నుంచి ఎనిమిది లక్షల టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించింది.

Tags:    
Advertisement

Similar News