వీధి వ్యాపారులకు రుణాల మంజూరీలో తెలంగాణ టాప్

రాష్ట్రంలోని వ్యాపారులకు మూడు విడతల్లో రూ.695 కోట్ల రుణాలు అందజేశారు. కాగా, రెండో విడత రుణాల పంపిణీలో దేశంలోని టాప్ 10 స్థానాల్లో తెలంగాణ పట్టణాలే ఉన్నాయి.

Advertisement
Update:2023-06-02 07:44 IST

వీధి వ్యాపారులకు రుణాల మంజూరీలో తెలంగాణ టాప్

వీధి వ్యాపారులకు (Street Vendors) రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మూడు విడతల్లో వీధి వ్యాపారులకు రుణాలను పంపిణీ చేశారు. కాగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నాయి. వీధి వ్యాపారులకు రుణాలను మంజూరు చేస్తూ.. అగ్ర స్థానంలో నిలవడంతో తెలంగాణ అధికారులకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అవార్డులు అందించారు.

రాష్ట్రంలోని వ్యాపారులకు మూడు విడతల్లో రూ.695 కోట్ల రుణాలు అందజేశారు. కాగా, రెండో విడత రుణాల పంపిణీలో దేశంలోని టాప్ 10 స్థానాల్లో తెలంగాణ పట్టణాలే ఉన్నాయి. లక్ష నుంచి 10 లక్షలలోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో తెలంగాణకు టాప్ 10 స్థానాలు దక్కాయి. మూడో విడతలో నలబై లక్షలకు పైగా జనాభా ఉన్న కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్‌కు అగ్రస్థానం దక్కింది. రాష్ట్రం కనపరిచిన ఈ అద్భుతమైన రుణ మంజూరీకి గాను తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్, మెప్మా ప్రాజెక్ట్ మేనేజర్ చైతన్యకు మంత్రి అవార్డులు అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు అందిస్తోంది. సీఎం కేసీఆర్ 2020 ఫిబ్రవరి 24న ఈ మేరకు రుణాలు అందజేయడంతో పాటు స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ హైదరాబాద్ సహా.. అనేక పట్టణాల్లో వీధి వ్యాపారులకు రుణాలను మంజూరు చేస్తోంది. కరోనా సమయంలో వీధి వ్యాపారులే ఎక్కువగా నష్టపోయారు. దీంతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వీరికి వర్కింగ్ క్యాపిటల్‌ను అందించారు.

అగ్రస్థానంలోని తెలంగాణపట్టణాలు..

- లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో దేశవ్యాప్తంగా 3,555 పట్టణాలు ఉండగా.. తొలి పది స్థానాల్లో సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, కామారెడ్డి, బోధన్, జహీరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, పాల్వంచ, ఆర్మూర్ నిలిచాయి.

- లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న పట్టణాలు 442 ఉండగా.. వరంగల్ పట్టణం మొదటి స్థానంలో, నిజామాబాద్ 10వ స్థానంలో నిలిచాయి.

- 40 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో జీహెచ్ఎంసీ ప్రథమ స్థానంలో నిలిచింది.

Tags:    
Advertisement

Similar News