త్వరలో కేసీఆర్ స్కూల్ కిట్స్.. 25 లక్షల మంది విద్యార్థులకు లబ్ది

రాష్ట్ర వ్యాప్తంగా 25,76,587 మంది విద్యార్థులు స్కూల్ కిట్లను పొందనున్నారు.

Advertisement
Update:2022-12-28 07:42 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. మరో వినూత్న స్కీమ్ ప్రారంభించబోతోంది. ఇప్పటికే బాలింతలు, గర్భిణుల కోసం 'కేసీఆర్ కిట్లు', 'కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్లు' అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై విద్యార్థుల కోసం కూడా కిట్లు పంచిపెట్టనున్నది. రాష్ట్రంలోని 25 లక్షల మంది విద్యార్థుల కోసం 'కేసీఆర్ స్కూల్ కిట్స్' అందించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కిట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

'కేసీఆర్ స్కూల్ కిట్స్' ద్వారా విద్యార్థులకు ఉచితంగా బ్యాగ్, షూ, సాక్స్, టై, బెల్ట్, ఐడీ కార్డులు అందిస్తారు. ఇందు కోసం ప్రతీ ఏటా రూ.400 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ మౌఖికంగా ఆదేశించారని. త్వరలో నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి ఈ మేరకు కిట్లు పంపిణీ చేయనున్నారు.

తమిళనాడు, ఏపీలో ఇప్పటికే ఇలాంటి కిట్లను విద్యార్థులకు అందిస్తున్నారు. తెలంగాణలో కూడా ఉచితంగా టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్స్ అందిస్తున్నారు. విద్యార్థులకు మిడ్-డే మీల్స్ కూడా అందుబాటులో ఉంటోంది. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కిట్ల ద్వారా పేద విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో గర్భిణుల కోసం అందిస్తున్న కేసీఆర్ కిట్స్ పథకం చాలా ఆదరణ పొందింది. 2018లో ప్రవేశపెట్టిన ఈ పథకానికి మహిళల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ కిట్లు ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరిగినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ 21న కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్లను కూడా ప్రవేశపెట్టారు. బాలింతలు, బిడ్డల ఆరోగ్యం కోసం ఈ కిట్లు ఉపయోగపడుతున్నాయి.

ఇక ఇప్పుడు అందించబోతున్న కేసీఆర్ స్కూల్ కిట్స్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్స్, మోడల్ స్కూల్స్, అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్స్, కేజీబీవీలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు లబ్ది చేకూరనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 25,76,587 మంది విద్యార్థులు ఈ మేరకు స్కూల్ కిట్లను పొందనున్నారు. స్కూల్ బ్యాగుల కోసం రూ.255 కోట్లు, స్పోర్ట్స్ షూ కోసం రూ.120 కోట్లు, సాక్స్ రూ.7 కోట్లు, టై, బెల్టులు, ఐడీ కార్డుల కోసం రూ.20 కోట్లు మొత్తంగా రూ.400 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News