భూముల విలువ పెంపు.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి!
విలేజ్ మ్యాప్ ఆధారంగా ప్రధాన రహదారులను గుర్తించాలని, దాంతో పాటు ఆర్టీరియల్ రోడ్లకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌లను గుర్తించాలని ప్రభుత్వం అధికారులను కోరింది.
హామీల అమలుకు నిధుల సమీకరణలో భాగంగా తెలంగాణలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. జూన్ 18 నుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ కోరింది. జూలై 24 నాటికి తుది రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
ప్రస్తుతం ఉన్న ధరల కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు భూముల ధరలు పెరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ లేదా రాష్ట్ర రహదారులను ఆనుకుని ఉన్న ప్రాంతాలు లేదా ప్లాట్లు, గృహాలు, పరిశ్రమలు లేదా వ్యవసాయేతర వినియోగానికి ఉపయోగపడే ప్రాంతాలకు ఈ పెంపులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
విలేజ్ మ్యాప్ ఆధారంగా ప్రధాన రహదారులను గుర్తించాలని, దాంతో పాటు ఆర్టీరియల్ రోడ్లకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌లను గుర్తించాలని ప్రభుత్వం అధికారులను కోరింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ కంపెనీలు పంపిణీ చేస్తున్న బ్రోచర్‌లు, ఇతర ప్రకటనలను పరిశీలించాలని సూచించింది. ఇక వ్యవసాయ భూముల విషయంలో ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలించి.. పంచాయతీ అండ్ రెవెన్యూ శాఖ అధికారులతో నిర్ధారించుకోవాలని సబ్ రిజిస్ట్రార్‌లను కోరింది. రోడ్డుకు ఇరువైపులా ఉండే భూముల విలువ ఒకేలా ఉండాలని సూచించింది. భూముల విలువను పెంచటం ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు అధికంగా లభించే అవకాశం ఉంది. భూమి విలువ ఆధారంగా బ్యాంకులు రైతు పరపతిని నిర్ణయిస్తాయి.