దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ క్యాంపస్‌ను ఫార్మా హబ్‌గా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

Advertisement
Update:2023-02-22 08:04 IST
దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
  • whatsapp icon

తెలంగాణ రాష్ట్రం మరో రికార్డును సృష్టించబోతోంది. దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలు ఉండగా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయేది మూడోది కానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్య, వృత్తి విద్యా, భాషా ప్రావీణ్యం పెంచేందుకు వేర్వేరు యూనివర్సిటీలు ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు వీటి సరసన లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా చేరనున్నది.

ఇప్పటికే దేశంలోనే తొలి అటవీ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకున్నది. అలాగే గతేడాది కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసింది. తాజాగా లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రం ఫార్మా, బయోటెక్నాలజీ హబ్‌గా మారుతున్న తరుణంలో.. ఈ కొత్త యూనివర్సిటీ అవసరమైన మానవ వనరులను అందిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే నగరం చుట్టుకపక్కల అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటికీ అవసరమైన మానవ వనరులను సమకూర్చడంలో భాగంగానే ఈ ప్రత్యేక యూనివర్సిటీని నెలకొల్పుతున్నట్లు తెలుస్తున్నది. ఫార్మా సిటీకి సమీపంలోనే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ క్యాంపస్‌ను ఫార్మా హబ్‌గా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే కూకట్‌పల్లి క్యాంపస్‌లో ఉన్న ఫార్మసీ కోర్సులను సుల్తాన్‌పూర్‌కు తరలించాలని కూడా జేఎన్టీయూ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచే ఇక్కడి క్యాంపస్‌లో ఫార్మా-డీ కోర్సును ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 31 యూనివర్సిటీలు ఉన్నాయి. దేశంలోనే తొలి సాంకేతిక విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ నిలిచింది. ఇక బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. దూర విద్య ద్వారా అనేక కోర్సులను బోధిస్తున్నది. రాష్ట్రంలో 3 సెంట్రల్ యూనివర్సిటీలు, 15 రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, నాలుగు జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఒక ఓపెన్, నాలుగు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పాటైన విద్యా సంస్థ ఒకటి, ప్రభుత్వ డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు రెండు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News