విగ్రహంలో మార్పు అంటే బతుకమ్మ లేనట్టేనా..?

కేవలం కాంగ్రెస్ మార్కు చూపించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా..? లేక వారు చేసే మార్పులు నిజంగానే ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది.

Advertisement
Update:2024-02-05 10:05 IST

తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఉన్న విగ్రహంలో ఏమేం మార్పులు చేస్తారు..? అసలు తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం కాంగ్రెస్ మార్కు చూపించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా..? లేక వారు చేసే మార్పులు నిజంగానే ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది.

పాత విగ్రహం ఇలా..

2017 డిసెంబర్ లో తెలంగాణాలో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళా విభాగం ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తలపై కిరీటం, ఒక చేతిలో జొన్న కంకులు, మరో చేతిలో బతుకమ్మను పట్టుకున్నట్టుగా ఈ విగ్రహం ఉంటుంది. ఈ నమూనా ఆధారంగానే తెలంగాణ తల్లి విగ్రహాలను చాలా చోట్ల ఏర్పాటు చేశారు. సహజంగా తెలంగాణ తల్లి అంటే బతుకమ్మను చేతిలో పట్టుకున్న విగ్రహం రూపమే అందరికీ గుర్తొస్తుంది.

కొత్త విగ్రహం ఎలా..?

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు అనే నిర్ణయం ఎవరూ ఊహించలేదు. అయితే అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ నిర్ణయాలను ఏదో ఒక రూపంలో మార్చేందుకే కాంగ్రెస్ ఇష్టపడుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు అనే అంశం తెరపైకి వచ్చింది. గతంలో తెలంగాణ తల్లి అస్తిత్వపు చిహ్నాల పేరుతో గాంధీభవన్ లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విషయం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నెలకొల్పిన విగ్రహం ఎడమ చేతిలో చెరుకు గడ, జొన్న కంకులు పట్టుకుని ఉంటుంది. మరో చేతిని అభయహస్తంగా చూపెడుతుంది. ఈ విగ్రహాన్నే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర నమూనాగా చూపెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంటే బతుకమ్మ అనే ప్రస్తావన కొత్త విగ్రహంలో ఉండదన్నమాట. ఈ మార్పులకు ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయా..? అసలేం జరుగుతుంది..? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. 

Tags:    
Advertisement

Similar News