టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో ముగ్గురు సస్పెండ్..
ఉదయం 9.30గంటలకు టెన్త్ పరీక్ష మొదలు కాగా.. 9.37 గంటలకు పేపర్ వాట్సప్ లో ప్రత్యక్షమైంది. తాండూర్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ముగ్గరు ప్రభుత్వ సిబ్బందిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. వెంటనే విచారణకు ఆదేశించింది. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్ పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. .
బందప్ప సెల్ ఫోన్ నుంచి..
ఉదయం 9.30గంటలకు టెన్త్ పరీక్ష మొదలు కాగా.. 9.37 గంటలకు పేపర్ వాట్సప్ లో ప్రత్యక్షమైంది. తాండూర్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందప్ప, మరొక ఉద్యోగిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పేపర్ ను వాట్సప్ గ్రూప్ లో షేర్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్టు గుర్తించారు. 2017లో పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు మరోసారి పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ చేశారు.
లీకేజీ కాదు..
మరోవైపు ఇది లీకేజీ కాదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని చెబుతున్నారు అధికారులు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత పేపర్ బయటకు వచ్చింది కాబట్టి.. అది లీక్ కాదని అంటున్నారు పోలీసులు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ ను మీడియా గ్రూప్ లో పెట్టినట్టు గుర్తించారు. పోలీస్ శాఖతోపాటు, విద్యాశాఖ కూడా విచారణ చేపట్టింది.