తాండూరు కందిపప్పుకు GI (భౌగోళిక) గుర్తింపు

తాండూరు ప్రాంతం అట్టపుల్గైట్ క్లే ఖనిజంతో కూడిన సారవంతమైన లోతైన నల్ల నేలతోపాటు భారీ సున్నపురాయి నిక్షేపాలు తాండూరు కందిపప్పు నాణ్యతకు కారణమని చెప్పవచ్చు. తాండూర్ కందిపప్పు లో 22-24 శాతం ప్రోటీన్ ఉంటుంది, ఇది ఇతర తృణధాన్యాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ పప్పు మంచి రుచితో పాటు త్వరగా ఉడుకుతుంది. పైగా త్వరగా పాడవదు.

Advertisement
Update:2022-12-15 13:06 IST

తెలంగాణ లోని తాండూరు కందిపప్పుకు అరుదైన గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఈ కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు (geographical registration tag) లభించింది. ఈ మేరకు కేంద్రం వివరాలను వెల్లడించింది. తాండూరు జిఐ రిజిస్ట్రేషన్‌తో తెలంగాణ 16వ జిఐ ఉత్పత్తిని నమోదు చేసుకుంది.

ఈ GI నమోదు ప్రక్రియ కు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం అవసరమైన మార్గదర్శకత్వం, పరిశోధన, సాంకేతిక డేటాను అందించడంలో సహాయపడింది. యలాల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ తరపున రిజల్యూట్ గ్రూప్‌కు చెందిన జిఐ ఏజెంట్ సుభాజిత్ సాహా ఈ దరఖాస్తును దాఖలు చేసి, GI నమోదు ప్రక్రియ క్రమానికి ప్రాతినిధ్యం వహించారు.

దీనితో, దేశంలో మొత్తం జీఐ రిజిస్ట్రేషన్ పొందిన వస్తువుల సంఖ్య 432 చేరుకుంది. ఇప్పటి వరకు జీఐ రిజిస్ట్రేషన్ కొరకు 1000 కంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్, వరంగల్ చెప్తా (మిరపకాయలు) వంటి ఉత్పత్తులు తెలంగాణ జిఐ రిజిస్ట్రేషన్ల సంఖ్యను మరింత పెంచనున్నాయి.

నిజామాబాద్ పసుపు, బాలానగర్ సీతాఫలం తదితర వ్యవసాయ ఉత్పత్తులను జీఐ నమోదు కోసం అధ్యయనం చేయాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ లోని పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ ఫిలిగ్రీ, హైదరబాద్ లాడ్ బజార్ లు జీఐ గుర్తింపును పొందాయి.

తాండూరు కంది పప్పు ప్రత్యేకతలు

తాండూర్ కందిపప్పు స్థానిక రకం కందిపప్పు. ఇది ప్రధానంగా తాండూరుతో పాటు తెలంగాణలోని ఇతర వర్షాధార ప్రాంతాల్లో పండిస్తారు. వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో మొత్తం విస్తీర్ణంలో 50% కంటే ఎక్కువ (1.74 లక్షల హెక్టార్లు) ఈ కందిపప్పును పండిస్తారు.

తాండూరు ప్రాంతం అట్టపుల్గైట్ క్లే ఖనిజంతో కూడిన సారవంతమైన లోతైన నల్ల నేలతోపాటు భారీ సున్నపురాయి నిక్షేపాలు తాండూరు కందిపప్పు నాణ్యతకు కారణమని చెప్పవచ్చు. తాండూర్ కందిపప్పు లో 22-24 శాతం ప్రోటీన్ ఉంటుంది, ఇది ఇతర తృణధాన్యాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ పప్పు మంచి రుచితో పాటు త్వరగా ఉడుకుతుంది. పైగా త్వరగా పాడవదు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో తాండూరు కంది పప్పు బ్రాండ్ కు మంచి డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ , కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఈ పప్పు ఎగుమతి అవుతుంది.

ఇప్పుడు ఈ GI ట్యాగ్, అంతర్జాతీయ మార్కెట్‌లలో తాండూరు కంది పప్పు డిమాండ్‌ని పెంచడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం, దాదాపు 63,500 కుటుంబాలు (రైతులు, సాగుదారులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులు) తెలంగాణలో 'తాండూరు కందిపప్పు' సాగు మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

తెలంగాణలోని తాండూరు ప్రాంతం నుండి ఒక సంవత్సరంలో 'తాండూరు కందిపప్పు' మొత్తం ఉత్పత్తి సుమారు 4.75 లక్షల క్వింటాళ్లుగా ఉంది.

Tags:    
Advertisement

Similar News