తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది : మంత్రి కేటీఆర్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటి పైన దృష్టి సారించి, వాటి పరిష్కారానికి ప్రయత్నించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ కోరారు. పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన, అనుకూలమైన గమ్యస్థానంగా తెలంగాణ మారిందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఆయా సంస్థలకు పూర్తిగా సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ కె.దొరైస్వామి ఆధ్వర్యంలో లండన్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమవేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆయ కంపెనీ ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటి పైన దృష్టి సారించి, వాటి పరిష్కారానికి ప్రయత్నించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇన్నోవేషన్, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయం, ఐటీ మొదలుకొని అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని చెప్పారు.
రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమైందని.. ఇక్కడ నెలకొల్పిన ఎకో సిస్టమ్, రీసెర్చ్ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, స్టార్టప్స్, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల వల్ల ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతుల విధానం గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ఈ విధానం అనేక ప్రశంసలు అందుకుందని, మంచి ఫలితాలను కూడా ఇచ్చిందని మంత్రి కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ ఆధారిత కంపెనీల పెరుగుదల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని కేటీఆర్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్‌టైల్ వంటి రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. యూకేలోని ప్రముఖ విద్యా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భాగస్వామ్యాల ద్వారా వినూత్న అవకాశాలు కల్పిస్తోందని మంత్రి చెప్పారు.
అంబేద్కర్ విగ్రహం, సచివాలయం అద్భుతం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయం, 125 అడుగుల భారీ విగ్రహం అద్భుతంగా ఉన్నాయని బ్రిటన్‌లోని భారత వ్యాపారవేత్త కరణ్ బిలిమోరియా అభివర్ణించారు. తన సొంత రాష్ట్రం తెలంగాణ ఎదుగుతున్న తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఆయన కొనియాడారు.
విభిన్న సంస్కృతుల సమ్మేళనం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణ ఉందని భారత హై కమిషనర్ విక్రమ్ కె. దొరైస్వామి అన్నారు. హెవీ మిషనరీ, ఏవియేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, డిఫెన్స్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో యూకే సంస్థలతో భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు.