అనేక రాష్ట్రాలు కరెంటు కోతలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ తెలంగాణలో కోతలు లేవు

రాష్ట్రాలన్నీ విద్యుత్ కొరతతో అల్లాడుతూ ఉంటే తెలంగాణ మాత్రం డిమాండ్ కు తగ్గ విద్యుత్తును అందిస్తోంది. నిర్వహణ, ఇతర సాంకేతిక కారణాల వల్ల‌ తప్ప, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. వాస్తవానికి, ఏప్రిల్, మే నెలల్లో అధిక డిమా‍డ్ ను ముందుగానే ఊహించిన‌, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ‌ చర్యలను చేపట్టింది.

Advertisement
Update:2023-04-22 07:44 IST

వేసవికాలం విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుండటంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. అయితే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు విద్యుత్ డిమాండ్‌ను పెంచుతున్నప్పటికీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిర్వహణ పనుల సమయంలో చిన్న, చిన్న‌ విద్యుత్ సరఫరా అంతరాయాలు మినహా, రాష్ట్రం అన్ని రంగాలకు విద్యుత్ సరఫరాను పరిపూర్ణంగా చేస్తున్నదని, విద్యుత్ కోతలంటూ లేవని అధికారులు చెప్తున్నారు.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడం, జాతీయ విద్యుత్ కొరత వల్ల‌ అనేక రాష్ట్రాలు రోజువారీ విద్యుత్ అవసరాలు తీర్చలేకపోతున్నాయి. గత కొన్ని రోజులుగా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలు నివాస, పారిశ్రామిక ప్రాంతాలలో తరచుగా విద్యుత్ కోతలను విధిస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరుగుదల కారణంగా, లోడ్ షెడ్డింగ్‌ను నివారించడానికి అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలు అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది.

నివేదికల ప్రకారం, దేశంలో ఈ ఏప్రిల్ లో రాత్రిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 217 గిగావాట్లు (GW) ఉందని అధికారులు అంచనా వేశారు. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన అత్యధిక రాత్రి సమయ డిమాండ్ తో పోలిస్తే 6.4 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం అంతటా అప్రకటిత‌ విద్యుత్ కోతలను విధిస్తున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి ప్రజలు అనేక గంటల పాటు అప్రకటిత‌ విద్యుత్ కోతలను చవి చూస్తున్నారు, రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు 290 నుండి 297 మిలియన్ యూనిట్ల మధ్య ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన కూడా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ (MSETCL) పూణేలోని సిన్హాగడ్, నాందేడ్ నగరం, ధయారీలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్తు కోతలను ప్రకటించింది. ఏప్రిల్ 13న రాష్ట్రంలో మొత్తం గరిష్ట విద్యుత్ డిమాండ్ 27,800 మెగావాట్లు కాగా, రానున్న రోజుల్లో అది 30,000 మెగావాట్లు దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న‌ కర్ణాటకలో ప్రభుత్వం విద్యుత్ కొరత ఉందని చెప్పడం లేదు కానీ బెంగుళూరు తరచుగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది, కొన్నిసార్లు రోజుకు మూడు సార్లు విద్యుత్ కోత విధిస్తున్నారు. నగరంలో పాత సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటోంది. ఈ రాష్ట్రంలో మే నెలలో రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ 15,500 మెగావాట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రాలన్నీ విద్యుత్ కొరతతో అల్లాడుతూ ఉంటే తెలంగాణ మాత్రం డిమాండ్ కు తగ్గ విద్యుత్తును అందిస్తోంది. నిర్వహణ, ఇతర సాంకేతిక కారణాల వల్ల‌ తప్ప, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. వాస్తవానికి, ఏప్రిల్, మే నెలల్లో అధిక డిమా‍డ్ ను ముందుగానే ఊహించిన‌, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ‌ చర్యలను చేపట్టింది.

ఉదాహరణకు శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,322 మెగావాట్లుగా ఉంది, ఇది మార్చిలో నమోదైన 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్ కంటే చాలా తక్కువ. వాస్తవానికి, రాబోయే రోజుల్లో 16,000 మెగావాట్ల డిమాండ్‌ను దాటుతుందని విద్యుత్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లను విద్యుత్ సంస్థలు చేస్తున్నాయి.

హార్వెస్టింగ్ సీజన్‌లో ఉన్నందున, వ్యవసాయ రంగంలో విద్యుత్ డిమాండ్ తగ్గిందని, దీనివల్ల గృహ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ సరఫరా చేయడం కొంచెం సులభతరం చేసిందని ట్రాన్స్‌కో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుత వేసవి కాలంలో, గ్రేటర్ హైదరాబాద్‌లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 80 మిలియన్ యూనిట్ల‌ వరకు పెరిగే అవకాశం ఉంది.

గత సంవత్సరం, ఏప్రిల్-మేలో, బొగ్గు కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల అనేక రాష్ట్రాలు విద్యుత్తు అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేకుండా చూసేందుకు ఇక్కడి విద్యుత్తు సంస్థలు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నాయని ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

విద్యుత్ అధికారుల ప్రకారం, శుక్రవారం రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 242.49 మిలియన్ యూనిట్ల‌కు చేరుకుంది. ఇందులో థర్మల్ పవర్ 80.289 మిలియన్ యూనిట్లు, హైడల్ పవర్ 1.856 మిలియన్ యూనిట్లు, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌టిపిఎస్) ప్లాంట్ ద్వారా 27.186 మిలియన్ యూనిట్లు. ఇది కాకుండా సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ (CGS) ద్వారా 92.03 మిలియన్ యూనిట్లు, నాన్-కన్వెన్షనల్ ఎనర్జీ సిస్టమ్స్ ద్వారా 41.129 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగుతోంది..

Tags:    
Advertisement

Similar News