కీల‌క‌ ఆధారాల‌తోనే రఘురామ‌కు `సిట్` నోటీసులు..?

తమ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేసీఆర్ చాలా ప్రెస్టేజీగా తీసుకున్నారు. కాబట్టి డబ్బులు సర్దుబాటు చేసే విషయంలో ఎంపీ పాత్రపై బలమైన ఆధారాలు గనుక సిట్ దగ్గర ఉంటే ఎంపీ తగులుకున్నట్లే అనుకోవాలి.

Advertisement
Update:2022-11-25 10:21 IST

తెలంగాణాలో అధికారిక పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తగులుకున్నట్లేనా..? వైసీపీ తరపున నరసాపురంలో గెలిచిన రఘురామ‌ను ఈనెల 26వ తేదీన విచారణ హాజరుకావాల్సిందిగా `సిట్` నోటీసులిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలతో ఎంపీకి బాగా సన్నిహిత సంబంధాలున్నట్లు సిట్ తెలుసుకుంది. ఆ ముగ్గురు నిందితులను సిట్ విచారిస్తున్న విషయం తెలిసిందే.

ఈ విచారణలో భాగంగానే ఎవరి దగ్గర ఎంపీ ప్రస్తావన వచ్చిందో తెలీదు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరమైన రూ. 100 కోట్లను తాను సర్దుతానని ఎంపీ హామీ ఇచ్చినట్లు సిట్ కు సమాచారం దొరికిందట. అందుకనే విచారణకు హాజరుకావాలని రఘురామ‌కు అధికారులు నోటీసులిచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను విచారణలో ఎంపీ ఎలాగూ కాదంటారు. మరి దీనికి కౌంటరుగా సిట్ దగ్గర ఏమి ఆధారాలున్నాయో తెలీదు. తమ దగ్గరున్న ఆధారాలను సిట్ గనుక బయటపెడితే అప్పుడు ఎంపీ ఏమంటారో చూడాలి.

ఏదో గాలినిపోగేసి విచారణ పేరుతో ఎంపీ చుట్టూ ఉచ్చుబిగిద్దామని సిట్ అనుకుంటే అది జరిగేపనికాదు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో ఎంపీకి ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. పైగా ఇలాంటి విచారణలకు ఎంపీ భయపడే వ్యక్తి కూడా కాదు. అందులోనూ ఎంపీ హోదాలో ఉన్నారు కాబట్టి రఘురామ‌ని భయపెట్టడం సాధ్యంకాదు. ఎంతడబ్బయినా ఇచ్చి మంచి లాయర్లను పెట్టుకునేంత సామర్థ్యం ఉందన్న విషయం ఇప్పటికే ఏపీలోని కేసుల సందర్భంగా నిరూపితమైంది.

కాకపోతే తమ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేసీఆర్ చాలా ప్రెస్టేజీగా తీసుకున్నారు. కాబట్టి డబ్బులు సర్దుబాటు చేసే విషయంలో ఎంపీ పాత్రపై బలమైన ఆధారాలు గనుక సిట్ దగ్గర ఉంటే ఎంపీ తగులుకున్నట్లే అనుకోవాలి. ఎందుకంటే బీజేపీలో అత్యంత కీలకమైన నేత బీఎల్ సంతోష్ విచారణ విషయంలోనే సిట్ ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదు. కేసీఆర్ ఇచ్చిన ఫ్రీహ్యాండ్ కారణంగానే సిట్ ధైర్యంగా విచారణలో ముందుకెళుతోంది. కాబట్టి ఇప్పుడందరి దృష్టి ఎంపీ విచారణ పైన పడింది. ఆరోజు ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News