తెలంగాణ సెక్రటేరియట్ మెయిన్ గేట్ ఔట్!
బాహుబలి గేట్లను తొలగించిన రేవంత్ సర్కార్
తెలంగాణ సెక్రటేరియట్ సింహద్వారానికి ఎదురుగా ఉన్న బాహుబలి మెయిన్ ఎంట్రన్ గేట్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచే సెక్రటేరియట్ లోపలికి వెళ్లేవారు. మంత్రులు కూడా ఇదే గేట్ రాకపోకలకు ఉపయోగించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వాస్తు మార్పుల్లో భాగంగా సెక్రటేరియట్ సింహద్వారానికి ఎదురుగా ఉన్న బాహుబలి మెయిన్ గేట్ ను పూర్తిగా తొలగిస్తున్నారు. ఆ గేట్ కోసం ఏర్పాటు చేసిన భారీ ఆర్చ్ ను కూడా త్వరలో కూల్చేసి అక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. మెయిన్ గేట్ నుంచి సింహద్వారం వరకు ఉన్న రోడ్డును పూర్తిగా తొలగించి రెండు వాటర్ లాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సింహద్వారా పోర్టికో కు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలగించిన బాహుబలి మెయిన్ గేట్ ఈశాన్యం మూలలో హుస్సేన్ సాగర్ కు ఎదురుగా ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ వాస్తు పిచ్చితో పాత సెక్రటేరియట్ కూల్చేసి కొత్త సెక్రటేరియట్ నిర్మించారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అదే వాస్తు కోసం సెక్రటేరియట్ లో అనేక మార్పులు చేయిస్తున్నారు.