తెలంగాణ రన్‌కు అంచనాలకు మించి హాజరైన యువత
మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన తెలంగాణ రన్‌కు హైదరాబాద్‌లో యువత పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఊహించని స్థాయిలో రన్ విజయవంతమైంది. నెక్లెస్ రోడ్ డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ 2K, 5K రన్‌లకు ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లు హాజరయ్యారు. ప్రముఖ క్రీడాకారులు ఈషా సింగ్, ప్రముఖ సింగర్‌లు మంగ్లీ, రామ్, సినీ నటి శ్రీలీల హాజరయ్యారు.
తెలంగాణ రన్ ప్రారంభోత్సవానికి ముందు ప్రముఖ గాయకులు మంగ్లీ, రామ్‌లు ఆలపించిన తెలంగాణ పాటలు హాజరైన యువతీ, యువకులను ఉత్సాహపర్చాయి. దాదాపు 4 వేలకు పైగా రన్నర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతీని ప్రతిబింబించే బోనాలు, బతుకమ్మలతో డప్పుల చప్పుళ్లు, ఇతర నృత్యాలతో హోరెత్తించారు. 2K, 5K తెలంగాణ రన్‌లను రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రగతి సాధించడానికి ప్రధాన కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే నంబర్ వన్ సీఎం అని ప్రశంసించారు. మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. ఐటీ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రంతో మరే రాష్ట్రం పోటీ పడటం లేదని, ఇదే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత భాగస్వామ్యం కావాలని రాష్ట్ర యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను అంత్యంత సమర్థవంతంగా అమలు చేస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం స్ఫూర్తిగా తెలంగాణ రన్ ను నిర్వహించడం గర్వకారణమన్నారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు వివరించేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సురక్షిత నగరంతోపాటు ఆరోగ్యవంతమైన రాష్ట్రమని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలోనే కాక ప్రపంచంలోనే మేటిగా నిలిచిందని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అద్బుత సౌధం తెలంగాణ సచివాలయం నేపథ్యంలో తెలంగాణ రన్ నిర్వహించడం ఒక అద్బుత దృశ్యమని అంజనీ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రీడాకారిణి ఈషా సింగ్, సినీ నటి శ్రీలీల మాట్లాడారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, ఐజీ రమేష్ రెడ్డిలతో సహా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.