మూడు నెలల్లో తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు..

పాతబడిన ఎక్స్ ప్రెస్ సర్వీసుల్ని పల్లె వెలుగు బస్సులుగా మార్చడంతోపాటు, నేరుగా 100 నుంచి 120 బస్సుల్ని పల్లె వెలుగు సర్వీసులకోసం కొనుగోలు చేయడానికి ఆర్టీసీ సిద్ధమైంది. దీంతో చాలా కాలం తర్వాత ఆర్టీసీకి కొత్త పల్లె వెలుగు బస్సులు రాబోతున్నాయి.

Advertisement
Update:2023-09-05 06:13 IST

ఓవైపు ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకుంటూనే, మరోవైపు సాధారణ ప్రయాణికుల అవసరాలకోసం మరిన్ని డీజిల్ బస్సులకు ఆర్డర్ ఇస్తోంది తెలంగాణ ఆర్టీసీ. పాత బస్సులను షెడ్డుకు తరలించే క్రమంలో కొత్తవాటికి టెండర్లు పిలిచింది. టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటేషన్ తో ముందుకు రాగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు అధికారులు. మొత్తంగా 910 బస్సులకు ఆర్డర్ ఇవ్వబోతున్నారు. బస్సులను ఆయా కంపెనీలు పంపిస్తే, బస్ బాడీల నిర్మాణానికి కనీసం 3 నెలలు సమయం పడుతుందని అంచనా. అంటే.. మూడు నెలల్లోగా కొత్త బస్సులు రోడ్లపై పరుగులు తీయాలనే లక్ష్యంతో అధికారులు పనులు పూర్తి చేస్తున్నారు.

అధికంగా ఎక్స్ ప్రెస్ లు..

ఎలక్ట్రిక్ బస్సులను సూపర్ లగ్జరీ స్థానంలో వాడాల్సి ఉంటుంది. అయితే గ్రామాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు మంచి డిమాండ్ ఉంది. అద్దెబస్సులు మినహాయిస్తే ఆర్టీసీ వద్ద 1800 ఎక్స్ ప్రెస్ సర్వీసులున్నాయి. కొత్తగా వచ్చే వాటిలో 540 బస్సుల్ని ఎక్స్ ప్రెస్ సర్వీసులుగా మార్చబోతున్నారు అధికారులు. ఆ మేర పాత వాటిని తుక్కుకింద మార్చేస్తారు. ఓ మోస్తరుగా ఉన్నవాటిని, పల్లె వెలుగు సర్వీసులుగా మార్చేస్తారు.

స్లీపర్ బస్సులకూ చోటు..

కొత్తగా వచ్చే బస్సుల్లో 50నుంచి 60 ఏసీ లేదా స్లీపర్ బస్సులు ఉంటాయని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం రాజధాని ఏసీ బస్సులు సీటింగ్ సౌకర్యంతోనే ఉన్నాయి. వాటి స్థానాల్లో స్లీపర్ బస్సుల్ని సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. పైన బెర్త్ లు, కింద సీట్లు ఉంటే స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్ని తీసుకోబోతోంది ఆర్టీసీ.

పల్లె వెలుగుకి కొత్త వెలుగు..

పాతబడిన ఎక్స్ ప్రెస్ సర్వీసుల్ని పల్లె వెలుగు బస్సులుగా మార్చడంతోపాటు, నేరుగా 100 నుంచి 120 బస్సుల్ని పల్లె వెలుగు సర్వీసులకోసం కొనుగోలు చేయడానికి ఆర్టీసీ సిద్ధమైంది. దీంతో చాలా కాలం తర్వాత ఆర్టీసీకి కొత్త పల్లె వెలుగు బస్సులు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా పల్లె వెలుగు బస్సులుగా హైర్ సర్వీసులనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటితోపాటు ఆర్టీసీ కొత్త బస్సులు కూడా ప్రయాణం మొదలు పెడతాయి. కొత్తగా తీసుకోబోతున్న 910 బస్సుల్లో దాదాపు 200 వరకు సిటీబస్సులుగా హైదరాబాద్ సిటీ కోసం కేటాయిస్తారని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News