సీఎం గవర్నమెంట్ స్కూలే.. వారి పిల్లల సంగతేంటి..?

సీఎం ప్రభుత్వ స్కూల్ లోనే చదువుకొని ఉండొచ్చు కానీ, ఆయనతోపాటు వేదికపై ఉన్న వారి పిల్లలంతా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నవారేనని TPTF నేతలు గుర్తు చేశారు.

Advertisement
Update:2024-08-04 07:54 IST

"నేను ప్రభుత్వ స్కూల్ లో చదువుకున్నా, ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన వల్లే ఈ స్థాయికి వచ్చా"నని ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో గర్వంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో ఆయన ప్రైవేట్ టీచర్స్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రైవేట్ టీచర్లకు పెద్దగా విద్యార్హతలకు ఉండవని, వారు ప్రభుత్వ టీచర్లకంటే గొప్పేమీ కాదన్నారాయన. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్(TPTF) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ టీచర్స్ మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అన్ని అర్హతలు ఉండి, అవకాశాలు రాక తాము ప్రైవేట్ టీచర్లుగా కాలం వెల్లబుచ్చుతున్నామని చెప్పారు TPTF నేతలు. ప్రభుత్వాల నిర్వాకం వల్ల సకాలంలో ఉపాధ్యాయ పోస్ట్ ల భర్తీ నోటిఫికేషన్లు రాక తాము ప్రైవేట్ స్కూల్స్ లో చాలీచాలని జీతాలకు పనిచేస్తున్నామన్నారు. సీఎం వ్యాఖ్యలు పొరపాటని చెప్పాల్సిన కోదండరాం వంటి విద్యావేత్తలు కూడా నవ్వుతూ ఆయనను సమర్థించిన తీరు తమను మరింత బాధకు గురి చేసిందన్నారు. సీఎం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

సీఎం ప్రభుత్వ స్కూల్ లోనే చదువుకొని ఉండొచ్చు కానీ, ఆయనతోపాటు వేదికపై ఉన్న వారి పిల్లలంతా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నవారేనని TPTF నేతలు గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ టీచర్లను తక్కువచేసి మాట్లాడటం సరికాదనేది వారి వాదన. ప్రైవేట్ టీచర్స్ తోపాటు.. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) కూడా ఈ విషయంపై ఘాటుగానే స్పందించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్‌ స్కూల్స్ లో ఎందుకు చదువుతున్నారని ప్రశ్నించింది. ప్రైవేట్ టీచర్స్ ని తక్కువచేసి మాట్లాడటం సరికాదన్నారు ట్రస్మా నేతలు. 

Tags:    
Advertisement

Similar News