రేపు చండూరులో కేసీఆర్ సభ.. ఏం మాట్లాడతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ
కేసీఆర్ ఇన్నాళ్ల మౌనానికి రేపు తెరపడనుండటంతో.. తెలంగాణ సమాజమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొన్నది.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ జరగలేదు.
ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడతారనే వార్తలు వచ్చాయి. కానీ జరగలేదు.
ఫామ్‌హౌస్ ఘటన తర్వాత కేసీఆర్ విలేకరుల సమావేశం ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ జరగలేదు.
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నా.. సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులనే కాకుండా.. తెలంగాణ సమాజాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఆపరేషన్ ఫామ్‌హౌస్‌పై పార్టీ కార్యకర్తలు స్పందించవద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కానుండటం ఆసక్తికరంగా మారింది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో జరిగే సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారా అని యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలనేది అధినేత కేసీఆర్ లక్ష్యం. బైపోల్ షెడ్యూల్ రాక ముందు నుంచే నియోజకవర్గ నాయకులతో సమీక్షలు నిర్వహించారు. ఎలాంటి వ్యూహం అనుసరించాలో మంత్రులు, నాయకులకు దిశానిర్దేశనం చేశారు. దీంతో నియోజకవర్గం అంతా టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారంచేశారు. ఇక రేపటి సభ ద్వారా టీఆర్ఎస్‌కు మరింత మైలేజీ వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి. మీడియాకు కూడా ఎలాంటి ప్రకటనలు చేయని సీఎం.. ఇప్పుడు తన ప్రణాళికను వెల్లడించడమే కాకుండా, బీజేపీ కుట్రలపై కూడా విరుచుకపడే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ మధ్యవర్తులు చేసి కుట్రల ఆడియో టేపులు ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. టీఆర్ఎస్‌ను అస్థిరపరిచే కుట్ర జరిగిందనేది వాస్తవం. దీంతో కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సభలో మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన విశేషాల కంటే.. బీజేపీపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనే అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సభ తప్పకుండా చాలా కీలకమైనదని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ అన్నారు. బీజేపీ కుట్రలు గ్రహించిన ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని ఓడించడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ఈ సభకు నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వచ్చంధంగా వస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు.
కేసీఆర్ ఇన్నాళ్ల మౌనానికి రేపు తెరపడనుండటంతో.. తెలంగాణ సమాజమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొన్నది. పార్టీలకు అతీతంగా అందరూ సీఎం ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ స్పందన కోసం ఎవరూ ఇంతలా ఎదురు చూడలేదని పరిస్థితి చూస్తే అర్థం అవుతోంది.