కుదరని ఏకాభిప్రాయం.. టీ.కేబినెట్‌ విస్తరణ వాయిదా

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. అయితే ఇక్కడ మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది.

Advertisement
Update: 2024-07-04 04:06 GMT

తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎంపికతో పాటు కేబినెట్‌ విస్తరణ మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి జూలై ఫస్ట్‌ వీక్‌లోనే కేబినెట్‌ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్‌ ఎంపిక అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ దిశగా చర్చలు జరిగినప్పటికీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలపై పలువురు సీనియర్లు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ ఖర్గే నివాసంలో రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై దాదాపు గంట పాటు చర్చించారు. కేబినెట్‌ రేసులో ఉన్న వారి పేర్లను పరిశీలించారు. ప్రస్తుతం 6 కేబినెట్‌ బెర్తులు ఖాళీగా ఉండగా.. 20 మందికిపైగా రేసులో ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ ఒక్కరి విషయంలోనే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. నల్ల‌గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్లకు మంత్రి పదవులిచ్చినట్లవుతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా నుంచి జి.వివేక్‌, ప్రేమ్‌ సాగర్‌ రావు రేసులో ఉన్నారు. రేవంత్ రెడ్డి వివేక్‌ పేరును ప్రతిపాదించగా.. డిప్యూటీ సీఎం భట్టి ప్రేమ్‌సాగర్‌రావుకు మద్దతు తెలిపినట్లు సమాచారం. అయితే వెలమ సామాజికవర్గానికి చెందిన ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి ఇస్తే కేబినెట్‌లో ఓసీల సంఖ్య పెరుగుతుందన్న మరో చర్చ కూడా తెరపైకి వచ్చింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. అయితే ఇక్కడ మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. దీంతో నేతలు ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. ఇక శాఖల మార్పులో భాగంగా సీతక్కకు హోం మంత్రి పదవి ప్రచారంపైనా పలువురు సీనియర్లు పెదవి విరిచినట్లు సమాచారం. ప్రస్తుతం హోం శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది.

ఇక పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ నేతలు ఎటు తేల్చుకోలేకపోయినట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ కోసం బీసీ సామాజికవర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి తీవ్రంగా పోటీ పడుతున్నారు. మహేష్‌ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. మధుయాష్కి గతంలో నిజామాబాద్ ఎంపీగా పని చేశారు. ఈ విషయంలోనూ సమీకరణాలు కుదరలేదని తెలుస్తోంది. పీసీసీ విషయంలో పలువురు ఎస్సీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పీసీసీ ఎంపికతో పాటు కేబినెట్‌ విస్తరణను ఆగస్టుకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News