టీడీపీ ఓట్ల కోసం తెలంగాణ పార్టీల ఆరాటం.. కారణం ఇదే

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ప్రతీ ఒక్క రాజకీయ పార్టీకి అవసరం. అదే సమయంలో తెలంగాణలో లేకుండా పోయిన టీడీపీ పార్టీ ఓటర్లు కూడా గెలుపు నిర్దేశించే స్థాయిలోనే ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నామమాత్రమే అయినా.. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.

Advertisement
Update:2022-08-13 16:44 IST

తెలంగాణ అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక మీద ఫోకస్ పెట్టినా.. అంతిమంగా మాత్రం అసెంబ్లీ ఎన్నికల గెలుపే అన్ని పార్టీల లక్ష్యం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా వాడుకొని అధికారం చేపట్టిన టీఆర్ఎస్‌కు ఈ సారి ఎన్నికలు మాత్రం విషమ పరీక్ష కాబోతున్నాయి. ఒకవైపు బీజేపీ బలంగా దూసుకొని వస్తుండగా.. కొత్త నాయకత్వంలో టీ-కాంగ్రెస్ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ హడావిడి చేస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ప్రతీ ఒక్క రాజకీయ పార్టీకి అవసరం. అదే సమయంలో తెలంగాణలో లేకుండా పోయిన టీడీపీ పార్టీ ఓటర్లు కూడా గెలుపు నిర్దేశించే స్థాయిలోనే ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నామమాత్రమే అయినా.. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్న అధిక శాతం నాయకులు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. గత ఎన్నికల్లో కూడా టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. 118 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ 7.1 శాతం ఓట్లతో ఒక సీటు గెలుచుకుంది. కానీ టీడీపీ కేవలం 13 స్థానాల్లో పోటీ చేసి 3.5 శాతం ఓట్లతో రెండు సీట్లు గెలిచింది. ఈ లెక్క చూస్తే బీజేపీ కంటే టీడీపీకి క్షేత్ర స్థాయిలో ఎంత బలం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు టీ-టీడీపీని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. అయితే ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఇటీవల భద్రాచలంలో పర్యటించిన సమయంలో చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని తిరిగి బలపరుస్తామని పేర్కొన్నారు. అయితే టీడీపీ తెలంగాణలో గెలవడం అసాధ్యమే అయినా.. ఆ పార్టీ అభిమానులు, సాంప్రదాయ ఓటర్లు కనుక ఎవరికైనా మద్దతు ఇస్తే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు తమ్ముళ్ల ఓట్లు తమకు పడేలా వ్యూహం సిద్ధం చేస్తున్నాయి.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే. కానీ రాష్ట్రం విడిపోయిన అనంతరం చంద్రబాబు, కేసీఆర్ మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గం పార్టీకి దూరం కాకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీతోనే ఉంది. అదే సమయంలో టీడీపీ అభిమానులను కూడా చేజార్చుకోకుండా ఇటీవల టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జయంతిని స్వయంగా టీఆర్ఎస్ నాయకులు జరిపించడం.. టీడీపీ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహమేనని భావిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ కూడా ఈ మధ్య చంద్రబాబును విమర్శించడం తగ్గించారు. ఎన్టీఆర్‌ను పొగుడుతూ.. టీడీపీ ఓటర్లను తమవైపు తిప్పుకుంటున్నారు.

ఇక టీడీపీ నుంచి వచ్చి ఏకంగా టీ-పీసీసీ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఆయన వచ్చిన తర్వాత పాత టీడీపీ స్నేహితులను కాంగ్రెస్‌లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న మాజీ తెలుగుదేశం నాయకులతో కూడా టచ్‌లో ఉంటూ.. కాంగ్రెస్‌లోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, చంద్రబాబుపై ఏనాడూ రేవంత్ విమర్శలు చేయరు. ఆయన చంద్రబాబు మనిషి అని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. రాబోయే ఎన్నికల్లో తనకు టీడీపీ ఓటు బ్యాంకు గెలుపును అందిస్తుందనే ధీమాతో రేవంత్ ఉన్నారు. టీడీపీ ఓటర్లలో కూడా రేవంత్ పట్ల అభిమానం ఉందని.. నియోజకవర్గ పర్యటనలకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ క్యాడర్‌తో పాటు టీడీపీ అభిమానులు కూడా వస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి.

తండ్రి రాజశేఖర్ రెడ్డి, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌కి రాజకీయ శత్రువైన చంద్రబాబును.. తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న వైఎస్ షర్మిల విమర్శించక పోవడం అందరూ గమనిస్తున్నారు. కరోనా సమయంలో చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత ఉంటే బాగుండేదని స్వయంగా షర్మిల వ్యాఖ్యానించడం తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా ఆయనను పొగుడుతూ షర్మిల ట్వీట్ చేశారు. తెలంగాణలో ఎన్నో సంస్కరణలు అమలు చేసింది ఎన్టీఆర్ అయితే.. చంద్రబాబు కారణంగా హైదరాబాద్ ఎదిగిందని ఓ సారి వ్యాఖ్యానించారు. ఇవన్నీ టీడీపీ ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి షర్మిల వ్యూహాత్మకంగా చేస్తున్న వ్యాఖ్యలే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక తానేమీ తీసిపోలేదంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఎన్టీఆర్‌ను పొగడటం మొదలుపెట్టారు. ఏపీలో బీజేపీతో టీడీపీ జత కడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో.. తెలంగాణలో కూడా టీడీపీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. సమయం దొరిగినప్పుడల్లా తెలుగు జాతి గర్వించదగిన నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ అంటూ బీజేపీ నేతలు పొగుడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందా.. బహుముఖ పోరు ఉంటుందా అనే విషయం పక్కన పెడితే.. అన్ని పార్టీలు టీడీపీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి మాత్రం కష్టపడుతున్నారని చెప్పవచ్చు. చాలా నియోజకవర్గాల్లో గెలుపును నిర్ణయించే స్థాయిలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు తమకు పనికి వస్తుందనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు ఇలా ఓటర్లకు గేలం వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News