సీపీఆర్‌తో 50 శాతం మంది ప్రాణాలను రక్షించవచ్చు : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

ఎవరైనా వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వెంటనే సీపీఆర్ చేస్తే తప్పకుండా ప్రాణాలను కాపాడొచ్చని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

Advertisement
Update:2023-03-01 17:35 IST

ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ ఎటాక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో 45 నుంచి 50 ఏళ్ల వయసు దాటిన వాళ్లలోనే వచ్చే ఈ గుండె నొప్పి.. ఈ మధ్య ఇరవైల్లో ఉన్న యువకులకు కూడా వస్తోంది. మారుతున్న జీవన శైలే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఏ వ్యక్తికి అయినా గుండెపోటు సంభవిస్తే వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం వల్ల వాళ్లు బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా మరోసారి అందరికీ తెలియజేశారు.

ఎవరైనా వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వెంటనే సీపీఆర్ చేస్తే తప్పకుండా ప్రాణాలను కాపాడొచ్చని మంత్రి చెప్పారు. గుండె నొప్పి బారిన పడే వారిలో 50 శాతం మందిని సీపీఆర్ ద్వారా రక్షించవచ్చని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. తెలంగాణలో సడెన్ కార్డియాక్ అరెస్టు వల్ల ఏడాదికి సగటున 24 వేల మంది చనిపోతున్నట్లు ప్రాథమిక సర్వేలో తెలిసిందని మంత్రి చెప్పారు. అందుకే ప్రతీ ఒక్కరు సీపీఆర్‌పైన అవగాహన కలిగి ఉండటమే కాకుండా.. ఆసక్తి ఉంటే శిక్షణ కూడా తీసుకోవాలని మంత్రి కోరారు.

మేడ్చెల్ జిల్లాలో సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి సీపీఆర్ గురించి మాట్లాడుతూ.. సీపీఆర్ శిక్షణ తీసుకున్నా, దానిపై అవగాహన ఉన్నా.. తెలంగాణలో సడెన్ కార్డియాక్ అరెస్టుకు గరయ్యే సగం మందిని కాపాడవచ్చిన తెలిపారు. సీపీఆర్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదని.. సామాన్యులు కూడా దీనిపై అవగాహన తెచ్చుకోవచ్చని మంత్రి చెప్పారు.

మేడ్చెల్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కేంద్రాలను విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వైద్యారోగ్య, మున్సిపల్, పోలీస్ శాఖలో పని చేసే ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పని చేసే పోలీస్.. సీపీఆర్ చేయడం వల్ల నిండు ప్రాణం నిలిచిందని గుర్తు చేశారు. దీని వల్లే సీపీఆర్ ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు. సీపీఆర్ శిక్షణను కేవలం గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లకే పరిమితం చేయకుండా.. గేటెడ్ కమ్యునిటీస్, సెక్యూరిటీ సంస్థలు, ఐటీ సంస్థలకు కూడా విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

చిన్నతనంలోనే యువకులు గుండెపోటుకు గురవడం తనను కలచి వేస్తోందని అన్నారు. అందుకే మన జీవన శైలిని మార్చుకోవల్సిన అవసరం కూడా ఉందని మంత్రి సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ప్రతీ రోజు వ్యాయామం చేయడం.. లేదంటే కాసేపు నడవటం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అందరి లైఫ్ స్టైల్ మారిపోయిందని.. అందుకు ఒత్తిడిని తగ్గించుకోవడమే కాకుండా.. సరైన ఆహారం తీసుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని మంత్రి హరీశ్ రావు కోరారు.


Tags:    
Advertisement

Similar News