ఆరు గ్యారెంటీల అమలులో అదే కీలకం.. త్వరలో క్షేత్ర స్థాయి పరిశీలన

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, మభ్యపెట్టేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Update:2024-01-13 08:40 IST

ఆరు గ్యారెంటీల అమలుకి సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం వాటిని ఆన్ లైన్ లో నమోదు చేయించే ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే ఈ దరఖాస్తుల ఎంట్రీ థర్ట్ పార్టీలకు ఇవ్వడంతో గందరగోళం మొదలైంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రజల డాక్యుమెంట్లు ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనిపై సరైన వివరణ లేకపోయినా ఆరు గ్యారెంటీల అమలుపై తాము చిత్తశుద్ధితో ఉన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. తాజాగా మంత్రి వర్గ ఉపసంఘం.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పక్కదోవ పట్టకుండా.. అర్హులకే లబ్ధి చేకురేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రులు.


ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఇతర మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో ప్రజాపాలనపై సమీక్ష నిర్వహించింది. నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు మంత్రులు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను పరిశీలించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. అనర్హులను పక్కనపెట్టేందుకు క్షేత్ర స్థాయి పరిశీలన ఉపయోగపడుతుందన్నారు.

ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలకోసం 1.05 కోట్ల దరఖాస్తులు రాగా, ఇతర కేటగిరీల కింద మరో 19.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుదారుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించలేదు. అంటే బ్యాంకులనుంచి కానీ, ప్రభుత్వ సిబ్బంది నుంచి కానీ ఓటీపీ కోసం ఎలాంటి ఫోన్ కాల్స్ రావనే విషయాన్ని ప్రజలకు కచ్చితంగా తెలియజేయాలన్నారు మంత్రులు. ఓటీపీ అనే అంశం దరఖాస్తులో లేదు కాబట్టి.. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వొద్దన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, మభ్యపెట్టేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News