పీయూష్ గోయల్ ఇప్పుడు నూకలు తింటారా..?

దేశ ప్రజల ఆహార అవసరాలపై మోదీ ప్రభుత్వానికి దీర్ఘకాలిక ప్రణాళిక కరువైందని, ఈ సంక్షోభంతో వారి అసమర్థత మరోసారి రుజువైందని అన్నారు కేటీఆర్. ప్రజాసంక్షేమంపై కనీస అవగాహన లేని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని చెప్పారు.

Advertisement
Update:2022-09-10 20:42 IST

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల కిందట ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలసి విజ్ఞప్తి చేశారు తెలంగాణ నేతలు. ససేమిరా అన్న కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించారు. ఇప్పుడు నూకల ఎగుమతులపై కూడా కేంద్రం నిషేధం విధించింది. దేశంలో బియ్యం దొరక్క మంత్రి పీయూష్ గోయల్ ఆ నూకలే తింటారేమో అని అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆనాడు అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి తెలంగాణ ధాన్యం సేకరించకుండా తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటి కొరతకు కారణమేంటో చెప్పాలని నిలదీశారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానమంటూ లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు కేటీఆర్.

తెలంగాణ రాష్ట్రం విఫలమైందని చూపే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు కేటీఆర్. ఆనాడు వివక్షతో తెలంగాణ ఆహార ధాన్యాలు కొనుగోలు చేయకుండా.. దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా వన్‌ నేషన్‌ వన్‌ ప్రొక్యూర్‌ మెంట్‌ విధానాన్ని అనుసరించాలని, రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఇటీవల గొప్పలు చెప్పుకున్న కేంద్రం.. ఇప్పటికే గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిందని, ఇప్పుడు బియ్యం, ఆఖరుకి నూకల ఎగుమతిపై కూడా నిషేధం విధించిందని చెప్పారు.

ముందు చూపు లేకే నిల్వలు తగ్గాయి..

ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై మోదీ ప్రభుత్వానికి దీర్ఘకాలిక ప్రణాళిక కరువైందని, ఈ సంక్షోభంతో వారి అసమర్థత మరోసారి రుజువైందని అన్నారు. ప్రజా సంక్షేమంపై కనీస అవగాహన లేని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని చెప్పారు.

రైతులు వరి వేయకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని, దాని ఫలితంగా ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గిందని అన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో ఈ తగ్గుదల కోటి ఎకరాలకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా దేశ వ్యాప్తంగా 12 నుంచి 15 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోతుందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి వివక్ష లేని నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని సేకరించి దేశ ప్రజల ఆహార భద్రతకు ఢోకా లేకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News