ఇదే మీ చివరి బడ్జెట్.. ఇప్పుడైనా సహకరించండి..

మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి నినాదాలు, విధానాలను కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కేటీఆర్.

Advertisement
Update:2023-01-14 16:02 IST

తెలంగాణలో పారిశ్రామిక పురోగతికి సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌ కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాల‌కు స‌హ‌క‌రిస్తే దేశానికి స‌హ‌క‌రించిన‌ట్లేనని పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టుల‌న్నీ జాతీయ ప్రాధాన్యత ఉన్నవేనని ఆ లేఖలో గుర్తు చేశారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీల‌కంగా ఎదిగిందని చెప్పారు కేటీఆర్.

జహీరాబాద్ నిమ్స్ లో మౌలిక స‌దుపాయాల క‌ల్పనకోసం నిధులు విడుదల చేయాలని తన లేఖలో ప్రస్తావించారు కేటీఆర్. హైద‌రాబాద్ – వ‌రంగ‌ల్, హైదరాబాద్ - నాగపూర్, హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్లకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. జ‌డ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. దీనికోసం బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు మంజూరు చేయాలన్నారు. అప్‌ గ్రేడేష‌న్ తోనే ఇది సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ ను పున‌రుద్ధరించాలని సూచించారు. హైద‌రాబాద్‌ లో నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌న్నారు. హైద‌రాబాద్ ఫార్మాసిటీకి రాబోయే కేంద్ర బ‌డ్జెట్‌ లో నిధులు కేటాయించాల‌ని మరోసారి గుర్తు చేశారు కేటీఆర్. చేనేత రంగానికి జీఎస్టీ మిన‌హాయించాల‌ని సూచించారు. ఐటీఐఆర్ లేదా స‌మాన ప్రాజెక్టు తెలంగాణకు ఇవ్వాల‌ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ లో హైదరాబాద్‌ ను చేర్చాలని కోరారు మంత్రి కేటీఆర్. వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, కేంద్ర బడ్జెట్‌ లో కనీసం రూ.300 కోట్లు ప్రకటించాలని కోరారు. టెక్స్ టైల్ పార్క్, వీవింగ్ పార్క్, అపెరల్ పార్క్ లతో కూడిన మెగా పవర్‌ లూమ్ క్లస్టర్‌ ను సిరిసిల్లకు మంజూరు చేయాలని, పవర్ లూమ్‌ ల అప్‌ గ్రెడేషన్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరు చేయాలన్న కేటీఆర్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహ‌కాలు అందించాల‌న్నారు.

మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి నినాదాలు, విధానాలను కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కేటీఆర్. ఎనిమిదేళ్లుగా కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టే ప్రతి సందర్భంలోనూ ప్రోత్సాహక నిధులకోసం విజ్ఞప్తులు చేసినా చెప్పుకోదగ్గ ఆర్థిక సాయం అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడే పలు అంశాలపై సానుకూలంగా స్పందించాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News