కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నారు.. మోడీపై కేటీఆర్ ఫైర్
పేదలకోసం ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా ? కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోడీ విధానమా ? అని ఆయన ప్రశ్నించారు.
'పేదల పథకాలపై మీకెందుకంత అక్కసు .. పేదల పొట్ట కొట్టేందుకు ఈ ఉచిత పథకాలపై చర్చ' అని తెలంగాణ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోడీపై మండిపడ్డారు. మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటని, బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా అని ఆయన ప్రశ్నించారు. రోజు రోజుకీ సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ''మీరు 80 లక్షల కోట్ల అప్పు తెచ్చారు.. ఇది తెచ్చి ఎవరిని ఉద్ధరించారు.. దేశ సంపదను పెంచే తెలివి మీ ప్రభుత్వానికి లేదు, సంపదను పెంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేసే మనసు మీకు లేదు'' అని కేటీఆర్ మండిపడ్డారు.
పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ పెంచి కేంద్రం ప్రజల రక్తాన్ని జలగల్లా జుర్రుకుంటోందని, మరోవైపు పేదల నోటికాడి తిండి లాగేసే దుర్మార్గానికి తెగించిందని ఆయన మండిపడ్డారు. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా ? కాకులను కొట్టి గద్దలకు వేయడమే మోడీ విధానమా ? రైతు రుణ మాఫీ చేదు.. కార్పొరేట్ రుణ మాఫీ ముద్దా ? నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్లకు పన్ను రాయితీలా అని ప్రశ్నించారు. 8 ఏళ్ళ పాలనలో దేశంలో పేదరికం పెరిగిపోయిందని, నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తి గడించామన్నారు. .మీకు ముందున్న 14 మంది ప్రధానులు కలిసి 56 లక్షల కోట్ల అప్పు చేస్తే మీరొక్కరే 80 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ,అడ్డూ, అదుపూ లేకుండా చేసిన ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే వార్షిక రాబడిలో 37 శాతం ఖర్చవుతోందని పేర్కొన్న ఆయన..ఇదే విషయంలో కాగ్ మిమ్మల్ని హెచ్చరించిందన్నారు.
ఆకలి సూచీలో నానాటికీ దిగజారి 116 దేశాల్లో 101 వ స్థానానికి చేరుకున్నాం.. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5 శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు కేంద్రం విడుదల చేసిన లెక్కలే స్పష్టం చేస్తున్నాయి అని కేటీర్ అన్నారు. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం కేంద్రం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు.. కానీ మీ ప్రభుత్వం 54 శాతం చేసినట్టు కాగ్ తలంటలేదా అని ప్రశ్నించారాయన. ఇంత సొమ్ము రుణంగా తెచ్చి మీ ప్రభుత్వం ఏ ప్రయోజనాలకోసం ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అప్పులతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టునైనా కట్టారా ? మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేశారా ? పేదల కడుపు నింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చారా ? ఇవేవీ చేయనప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరాయో మోడీయే చెప్పాలని ఆయన అన్నారు.
దశాబ్దాలుగా ప్రకృతి ప్రకోపానికి గురై, గిట్టుబాటు ధరల్లేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఇస్తున్న ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ఇవ్వవద్దని చెబుతున్నారా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి 13 నెలల పాటు వారిని రోడ్ల పాలు చేశారన్నారు. 700 మందికి పైగా రైతుల ఆత్మహత్యలకు కారణమైన మీకు రైతు సంక్షేమం అనే మాటకు కూడా అర్థం తెలియదన్నారు. దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరవేశాక.. జాతినుద్దేశించి మీరు చేసే ప్రసంగంలో పేదల సంక్షేమం కోసం చేపట్టే పథకాలపై మీ వైఖరేమిటో స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.