వైసీపీపై హరీష్‌రావు సింపతీ..

గతంలో పశ్చిమ బెంగాల్‌లో బ్రిడ్జ్ కూలిపోతే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు దేవుడు సిగ్నల్ ఇచ్చినట్టు మోదీ చెప్పారని, తాజాగా గుజరాత్‌లో కూడా బ్రిడ్జ్ కుప్పకూలిందని, త్వరలో జరిగే ఎనికల్లో అక్కడి ప్రభుత్వం కూడా కూలిపోతుందా అని ప్రశ్నించారు హరీష్ రావు.

Advertisement
Update:2022-10-31 15:19 IST

పార్టీకి రాజీనామా చేయరు, అలాగని జగన్‌పై విమర్శలు ఆపరు. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో వైసీపీకి ప్రతిరోజూ తలనొప్పే. అయితే ఈ విషయంలో వారు నిందించాల్సింది ఆయన్ను కాదు, ఆయనకు మద్దతిస్తూ రెచ్చగొడుతున్న బీజేపీని. పార్టీ గీత దాటిన రఘురామకృష్ణంరాజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈపాటికే పదుల సార్లు స్పీకర్‌కి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీన్ని వైసీపీ లైట్ తీసుకున్నా.. తెలంగాణ మంత్రి హరీష్ రావు మాత్రం వేలెత్తి చూపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తోందో వివరించారు. నయానో భయానో పక్క పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను తమ గుప్పెట్లో పెట్టుకోడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

టీడీపీ ఎంపీల సంగతేంటి..?

గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో కలిపేసుకున్నారని, అప్పుడు సైలెంట్‌గా ఉన్నవారు, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనం అయితే ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని, తెలంగాణలో అలాంటి డ్రామాలు సాగబోవని చెప్పారు.

బ్రిడ్జి కూలిపోవడంతో సిగ్నల్ వచ్చినట్టేనా.. ?

గతంలో పశ్చిమ బెంగాల్‌లో బ్రిడ్జ్ కూలిపోతే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు దేవుడు సిగ్నల్ ఇచ్చినట్టు మోదీ చెప్పారని, తాజాగా గుజరాత్‌లో కూడా బ్రిడ్జ్ కుప్పకూలిందని, త్వరలో జరిగే ఎనికల్లో అక్కడి ప్రభుత్వం కూడా కూలిపోతుందా అని ప్రశ్నించారు హరీష్ రావు. బెంగాల్‌కు ఒక నీతి, గుజరాత్‌కి మ‌రో నీతి ఉంటుందా అని సెటైర్లు వేశారు. బీజేపీ హయాంలో బోరు బావులకు మీటర్లు, రైతుల మెడకు ఉరితాళ్లు, కూలిపోయే బ్రిడ్జ్ లు, ప్రజల ప్రాణాలు నీళ్లపాలు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తుంటే.. అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను బీజేపీ లిఫ్ట్ చేయాలని చూస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. మునుగోడులో సభ పెడితే.. ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏమైందని ప్రజలు అడుగుతారనే భయంతో నడ్డా ఇటువైపు రాకుండా తప్పించుకుని పారిపోయారన్నారు.

Tags:    
Advertisement

Similar News