ఉచిత ప్రయాణం కోసం ఆడవేషం.. చివరికి ఏమైందంటే..!

ఓ వ్యక్తి అమ్మాయిలాగా పంజాబీ డ్రెస్ వేసుకొని.. తలపై చున్నీ చుట్టుకుని.. ముఖం కనిపించకుండా మాస్క్ ధరించి ఆడవాళ్ళతో కలిసి ఆర్టీసీ బస్సెక్కాడు.

Advertisement
Update:2023-12-12 17:50 IST

తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చెప్పినట్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం ప్రారంభం అయిందంటే మగాళ్లు కూడా ఆడవారి వేషం వేసుకొని ఉచితంగా ప్రయాణం సాగించే ప్రయత్నం చేస్తారేమోనన్న సరదా వ్యాఖ్యలు వినిపించాయి.

అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలే నిజమయ్యాయి. ఓ వ్యక్తి అమ్మాయిలాగా పంజాబీ డ్రెస్ వేసుకొని.. తలపై చున్నీ చుట్టుకుని.. ముఖం కనిపించకుండా మాస్క్ ధరించి ఆడవాళ్ళతో కలిసి ఆర్టీసీ బస్సెక్కాడు. ముందుగా అతడిని కండక్టర్ కూడా అనుమానించలేదు. టికెట్ కూడా అడగలేదు. అయితే అతడి వేషం, వాలకం చూసిన తర్వాత అనుమానం వచ్చింది. అతడి వద్దకు వెళ్లిన కండక్టర్ ఆధార్ కార్డు చూపించాలని అడిగాడు. దీంతో అతడు తట పటాయించాడు. చివరికి కండక్టర్ అతడి ముఖానికి పెట్టుకున్న మాస్క్ తొలగించడంతో యువకుడు ఆడవేషం వేసినట్లు బయటపడింది.

అయితే ఈ తతంగాన్ని బస్సులో ఉన్న కొందరు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు అతడిపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. టికెట్ డబ్బులు మిగిల్చుకునేందుకు ఇంతలా కక్కుర్తి పడాలా?.. అని కొందరు ప్రశ్నించారు. పాపం.. టికెట్ కొనడానికి డబ్బు లేకే ఈ పని చేశాడేమోనని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకోసం యువకుడు అమ్మాయిలాగా వేషం వేయడం అందరికీ నవ్వు తెప్పించింది. ఈ ఘటన తర్వాత ఇకపై ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఇలాంటి వ్యక్తుల పట్ల అలర్ట్ గా ఉండే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News