కర్నాటక ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్లు..

తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఒకరికి స్టార్ క్యాంపెయినర్ గా అవకాశం లభించింది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు స్టార్ క్యాంపెయినర్లుగా కర్నాటకలో ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement
Update:2023-04-20 13:56 IST

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నేతలు ప్రచార కర్తలుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ నేతలతో ప్రచారం చేయించాలనుకుంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఒకరికి స్టార్ క్యాంపెయినర్ గా అవకాశం లభించింది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు స్టార్ క్యాంపెయినర్లుగా కర్నాటకలో ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌ గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ను కూడా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కి చెందిన 8మంది నాయకులను కాంగ్రెస్‌ అధిష్టానం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిశీలకులుగా నియమించింది. స్టార్ క్యాంపెయినర్ల విషయానికి వస్తే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు మొత్తం 40 మంది లిస్ట్ రెడీ అయింది. ఆ 40మందిలో రేవంత్ రెడ్డి, అజారుద్దీన్ కూడా ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి, అజారుద్దీన్ తో ప్రచారం చేయించాలని చూస్తోంది కాంగ్రెస్.

బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ కూడా కర్నాటక ఎన్నికలకోసం 40 స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ రెడీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ.. ఇలా ఈ లిస్ట్ లో ఉన్నవారంతా కర్నాటక ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరితోపాటు తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణకు అవకాశమిచ్చారు. ఆమెను స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో చేర్చారు. ఈరోజుతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తవుతుంది. మే 10 న ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. 

Tags:    
Advertisement

Similar News