ఆరోగ్య రంగంలో తెలంగాణ గణనీయంగా పురోగమిస్తోంది : మంత్రి హరీశ్ రావు

ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. ఆరోగ్యాన్ని మించిన సంపద మానవుడికి ఏదీ లేదు. అందుకే 10 వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తీసుకొని వస్తున్నామని అన్నారు.

Advertisement
Update:2023-06-11 15:39 IST

రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగితే.. తెలంగాణ హెల్త్ హబ్‌గా మారింది. వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా పోటీ పడుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడు అది 70 శాతానికి చేరుకున్నదని మంత్రి చెప్పారు. బంజారాహిల్స్‌లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆసుపత్రిని దర్శకుడు రాజమౌళితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. ఆరోగ్యాన్ని మించిన సంపద మానవుడికి ఏదీ లేదు. అందుకే 10 వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తీసుకొని వస్తున్నామని అన్నారు. నీతి ఆయోగ్ రిపోర్డ్ ప్రకారం వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ సేవలను గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు.

వచ్చే నెలలో ఎంసీహెచ్ సేవలు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభం అవుతాయని అన్నారు. ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నాము. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రస్తుతం వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయన్నారు. సీ-సెక్షన్ (సిజేరియన్) ప్రసవాలు తగ్గించడానికి ప్రైవేటు ఆసుపత్రులు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. అనవసరమైన సీ-సెక్షన్ల వల్ల మహిళలు భవిష్యత్‌లో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు.

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత దర్శకుడు రాజమౌళికి దక్కుతుందని హరీశ్ రావు కొనియాడారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, ఇతర సేవలకు సంబంధించిన ఖర్చును రెండేళ్ల పాటు భరిస్తానని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారని మంత్రి చెప్పారు. ఆస్కార్ అవార్డు సాధించడం పట్ల రాజమౌళిని మంత్రి హరీశ్ రావు అభినందించారు. రాజమౌళి మాట్లాడుతూ హరీశ్‌రావు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సిద్ధిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తాను చూసిన నాటికి.. ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. పనితీరు చూసిన నాటి నుంచి హరీశ్‌రావుకు తాను పెద్ద అభిమానిగా మారానని రాజమౌళి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News