అభివృద్ధిలో దూసుకొని పోతున్న తెలంగాణ.. 9 ఏళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి ఇదే

రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు ముగిసి 10 ఏట అడుగుపెడుతున్న శుభ సమయంలో దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాధించిన ప్రగతిని మరోసారి దశదిశలా చాటేలా సంబరాలు జరుపుతోంది.

Advertisement
Update:2023-06-02 07:12 IST

ఒకప్పుడు కరువుతో అల్లాడిన నేల.. ఉపాధి కోసం వలస బాట పట్టిన నేల.. సరైన సమయానికి నీళ్లు రాక.. ఈ ప్రాంతానికి దక్కాల్సిన నిధులు దక్కక.. నియామకాల్లో అన్యాయానికి గురై.. ఇక ఇంతేనా అనే నిరాశతో ఉన్న తెలంగాణ ప్రజలు.. స్వరాష్ట్రం కోసం ఊరూ వాడా, గ్రామం పట్టణం అంతా ఏకమై పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. అందరినీ ముందుండి నడిపించిన ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్.. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 9 ఏళ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు తిరుగేలేదనేలా 9 ఏళ్ల పాలన సాగింది. రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు ముగిసి 10 ఏట అడుగుపెడుతున్న శుభ సమయంలో దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాధించిన ప్రగతిని మరోసారి దశదిశలా చాటేలా సంబరాలు జరుపుతోంది.

కరెంటు కష్టాలకు చెక్..

తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు చెక్ పడింది. అన్ని రంగాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. వ్యవసాయం కోసం రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తోంది. తెలంగాణ ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగా వాట్లు మాత్రమే. కానీ కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి వల్ల.. ఈనాడు రాష్ట్రంలో 17,305 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్నది. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా.. ఇప్పుడది 2,012 యూనిట్లకు చేరుకున్నది. కేవలం థర్మల్, హైడ్రో విద్యుత్ ఉత్పత్తే కాకుండా.. సోలార్ విద్యుదుత్పత్తిలో కూడా రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది.

ఇంటింటికీ తాగు నీరు..

ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంతం తాగు నీటి కోసం తల్లడిల్లింది. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పీడించింది. కానీ, తెలంగాణ ఏర్పడిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం యుద్ద ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఇవాళ రాష్ట్రంలోని 100 శాతం ఇళ్లకు సురక్షితమైన, స్వచ్ఛమైన మంచినీరు సరఫరా అవుతోంది. 100 శాతం ఆవాసాలకు పైపుల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. నేషనల్ వాటర్ మిషన్ అవార్డుతో ప్రభుత్వాన్ని సత్కరించింది. ఇదే పథకాన్ని కేంద్రం కూడా ఆదర్శంగా తీసుకొని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తోంది.

సాగు నీటితో సస్యశ్యామలమైన తెలంగాణ..

కరెంటు లేక, బోర్లు వేసినా నీళ్లు రాక సాగు నీటి కోసం నానా కష్టాలు పడిన రైతులు.. ఇప్పుడు ఏడాదిలో రెండు, మూడు పంటలు వేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టైన కాళేశ్వరంను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. గోదావరి నీటిని అనేక ప్రాంతాలకు తరలిస్తూ.. రైతన్నలకు సాగు నీటి కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రపంచ వేదికలపై వివరించే అవకాశం లభించింది. కేవలం కాళేశ్వరాన్ని నిర్మించడంతోనే సరిపెట్టక.. చిన్న నీటి ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 90 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం సాగునీటి సౌకర్యం కల్పించింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది.

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం..

తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి శతాబ్ధానికి పైగా ఆదరువుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై, పూడిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ పేరుతో అనేక చెరువులను పునరుద్ధరించారు. దీంతో చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగింది. అనేక చెరువులను కాళేశ్వరం నీటితో నింపారు. దీంతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. భూగర్భ జలాలు కూడా పెరిగాయి. చెరువుల అభివృద్ధితో చేపల పెంపకం కూడా పెరిగి మత్స్యకారులకు పెద్ద ఎత్తున లబ్ది జరిగింది.

రైతులకు అనేక పథకాలు..

స్వరాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఒకప్పుడు వ్యవసాయం దండగ అని పాలకులు రైతులను పట్టించుకోలేదు. కానీ స్వరాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమల్లోకి తెచ్చారు. రైతు రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు బీమా వంటివి అమలు చేశారు. అలాగే రైతు వేదికల నిర్మాణం, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితిల ఏర్పాటు, నీటి తీరువాల రద్దు, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేస్తూ.. వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఇప్పుడు తెలంగాణ దక్షిణ భారతదేశానికి రైస్ బౌల్‌గా మారింది.

దళితబంధు ఓ అద్భుతం..

సమాజంలో అణగారిన దళిత జాతి అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది రుణం కాదు. తిరిగి చెల్లించే పనిలేదు. పూర్తి గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన.. వచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ లబ్దిదారునిపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది దళితులు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. తాము ఎదగడమే కాకుండా.. మరి కొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.

పేదలకు సొంతిల్లు.. గృహలక్ష్మి పథకం..

రాష్ట్రంలో గూడులేని నిరుపేదలకు సొంత ఇంటి కలను తీర్చడమే కాకుండా గౌరవ ప్రదమైన నివాసాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల 91 వేల ఇండ్లు మంజూరు చేసింది. ఇందుకోసం రూ. 19,126 కోట్ల కేటాయించింది. అలాగే సొంత‌ స్థలం కలిగిన వారికి ఇంటి నిర్మాణానికి దశల వారీగా రూ. 3 లక్షలు మంజూరు చేసే గృహ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.

నాణ్యమైన విద్య అందిస్తూ..

విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 1000 గురుకుల విద్యాలయాలు విద్యార్థినీ విద్యార్థులకు సమగ్రమైన శిక్షణను అందిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్ల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడతున్నది. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయంలో పాటు అటవీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. విదేశీ విద్యను చదవాలనుకునే పేదలకు స్కాలర్‌షిప్స్ మంజూరు చేస్తోంది.

వైద్య రంగంలో గుణాత్మకమైన మార్పు..

రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ హాస్పిటళ్లల్లో 57 వైద్యపరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కోసం 42 ఉచిత డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటుచేసింది.గర్భిణులను హాస్పిటల్‌కు తీసుకురావడం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. మాతా, శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం సత్ఫలితాలనిచ్చింది. హైదరాబాద్‌ బస్తీలలో నివసించే పేదల వైద్య సేవల కోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. హైదరాబాద్‌ నగరవాసులతోపాటు సరిహద్దు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరం నాలుగుచెరగులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తోంది.

జిల్లాకో మెడికల్ కాలేజీ..

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు కూడా ఇచ్చింది. 60 ఏళ్ల కాలంలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే.. గత 9 ఏళ్లలోనే 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈ సంఖ్య చేరుకున్నది. నాడు ప్రభుత్వ , ప్రైవేటులో మొత్తం 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 55కు చేరాయి. ఎంబీబీఎస్ సీట్లు నాడు 2950 మాత్రమే ఉండగా.. నేడు 8340 సీట్లకు చేరుకున్నది.

భారీగా నియామకాలు..

తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఈ క్రమంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.33 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. రాబోయే రోజుల్లో మరో 80 వేల ఉద్యోగాల భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఏడాది ముగిసేలోగా దాదాపు 2.21 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ కానున్నాయి. ఇక ప్రైవేటులో 24 లక్షల మందికి ఉపాధి లభించింది. స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్నది. ఇందుకోసం రాజ్యాంగంలో ఆర్టికల్‌ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది. అటెండర్‌ నుంచి, ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలవుతుంది. ఈ విధంగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ.

తెలంగాణ పట్టణాలకు ఐటీ రంగం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగం వేగంగా అభివృద్ది చెందింది. హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతూ.. అగ్రస్థానంలో నిలిచింది. రూ.4 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు సాధించడమే కాకుండా.. దాదాపు 23 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. కేవలం హైదరాబాద్ నగరానికే ఐటీ పరిమితం కాకుండా.. టైర్-2 పట్టణాలకు కూడా ఐటీని విస్తరించింది. ఇప్పటికే ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్ధిపేట ప్రాంతాల్లో ఐటీ టవర్స్ నిర్మించింది. ఇటీవల ఐటీ మంత్రి కేటీఆర్ యూకే, యూఎస్ఏ పర్యటనల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. దీనిలో భాగంగా కొన్ని సంస్థలు కరీంనగర్, నల్గొండలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి. ఇక ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కూడా తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇక్కడ అనేక కంపెనీలు తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నాయి. హార్డ్‌వేర్ రంగంలో ఫాక్స్‌కాన్ తమ యూనిట్‌ను కొంగరకలాన్‌లో నిర్మిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టీ-హబ్ ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా రికార్డులకు ఎక్కింది. దీంతో పాటు వీ-హబ్, టీ-వర్స్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు చేయూత అందిస్తోంది.

ఇవే కాకుండా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కంటివెలుగు, తెలంగాణ ఆసరా పెన్షన్, గొర్రెల పంపిణీ పథకం, నేతన్న బీమా పథకం, ఆరోగ్య మహిళ వంటి పథకాలతో సంక్షేమంలో కూడా నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. 

Tags:    
Advertisement

Similar News