లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణే అగ్రగామి : మహబూబ్‌నగర్ సభలో మంత్రి కేటీఆర్
కరెంటు, తాగు సాగు నీరు ఇవ్వని వాళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. దేశంలో అత్యంత ఉత్తమమైన కంపెనీలు అన్నీ హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేముల-పొన్నకల్ గ్రామ శివారులో ఎస్‌డీజీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీకి సంబంధించిన రెండవ యూనిట్‌కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ..
గ్లాస్ ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న కార్నింగ్, గ్లాస్ ప్యాకేజింగ్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్నఎస్‌జీడీ ఫార్మా తమ ప్రపంచ స్థాయి ఫెసిలిటీని నిర్మించడానికి తెలంగాణను ఎంపిక చేసుకోవడం పట్ల చాలా సంతోషిస్తున్నాను అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో వ్యాక్సిన్, క్రిటికల్ డ్రగ్ ఉత్పత్తికి హబ్‌గా మారింది. ఈ క్రమంలో రూ.500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల.. లైఫ్ సైన్సెస్ ప్రాజెక్టు ప్యాకేజింగ్‌కు మద్దతుగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఎస్‌జీడీ-కార్నింగ్ భాగస్వామ్యం వల్ల 2030 నాటికి ఇండియాలో 250 బిలియన్ డాలర్ల ఎకో సిస్టమ్ సిస్టమ్ సాధించడానికి, పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
సాగు, తాగు నీళ్లు ఇవ్వనోళ్లు ఓట్ల కోసం వస్తారు..
కరెంటు, తాగు సాగు నీరు ఇవ్వని వాళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వచ్చే నాటికి దేవరకద్రలో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందేది. కానీ ఈ ఏడాది 98 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ ప్రాంతంలో చెక్‌డ్యామ్‌లె నిర్మాణం పూర్తి కావడం వల్లే సాగు నీరు అందిందని చెప్పారు. కరివేన ప్రాజెక్టు పూర్తయితే 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి చెప్పారు.
రాబోయే రోజుల్లో కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వం ఆసుపత్రులు కట్టిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. ఆనాడు కరెంటు, నీళ్లు ఇవ్వని వాళ్లు ఓట్ల కోసం వస్తారని మంత్రి హెచ్చరించారు. ఆ వ్యక్తులు మళ్లీ ఏ మొఖం పెట్టుకొని జనాల్ని వోట్లు అడగడానికి వస్తారని మంత్రి ప్రశ్నించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ భూత్పూర్‌లో మున్సిపల్ పార్కు, ఓపెన్ జిమ్‌లను ప్రారంభించారు. ఈ పర్యటనలో మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సియంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.