ఇంటర్నెట్ వినియోగదారుల్లో కేరళ, తెలంగాణ దేశంలోనే టాప్

రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ నెట్‌వర్క్, టవర్ల నిర్మాణానికి అనుమతులు సులభంగా మంజూరు చేయడం వల్లే రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినట్లు నివేదికలో తేల్చారు.

Advertisement
Update:2023-03-20 07:51 IST

ఇంటర్నెట్ వినియోగదారుల్లో కేరళ, తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు ఒక నివేదికలో వెల్లడైంది. తెలంగాణలో నివసించే ప్రతీ 100 మందిలో 83 మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేరళ 87 మంది సబ్‌స్క్రైబర్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ రెండవ స్థానంలో ఉన్నది. దేశం సగటు ప్రతీ 100 మందికి గాను 67గా ఉన్నది. దేశ సగటు కంటే కేరళ, తెలంగాణలో వినియోగదారుల సగటు ఎక్కువగా ఉండటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇంటర్నెట్ వినియోగంపై ఒక అధ్యయనం చేసింది. ఇందులో నాలుగు రాష్ట్రాల సగటు 80 కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కేరళ, తెలంగాణ తర్వాత పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో వినియోగదారుల సగటు 80 కంటే ఎక్కువగా ఉన్నది. ఇక మన పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతీ 100 మందికి గాను 67 మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. బీహార్ రాష్ట్రం 37 సగటుతో అట్టడుగున ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. కాగా, ఢిల్లీలో ప్రతీ 100 మందికి గాను 202 కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. అయితే ఢిల్లీని రాష్ట్రంగా కాకుండా ఒక నగరంగా పరిగణలోకి తీసుకున్నారు.

మొబైల్, ఫైబర్ (ల్యాండ్‌లైన్) ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిని ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకున్నారు. టెలీ డెన్సిటీ అనేది ఆయా దేశాలు, రాష్ట్రాల స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఒక భాగంగా కేంద్రం సూచిస్తోంది. ఆ నివేదికను అనుసరించి తెలంగాణలో 11.5 మిలియన్ రూరల్ సబ్‌స్క్రైబర్స్ ఉండగా.. అర్బన్ ఏరియాలో 20 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతీ 100 మందికి 110 ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ సంఖ్య ఇంకా 57 గానే ఉన్నది.

రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ నెట్‌వర్క్, టవర్ల నిర్మాణానికి అనుమతులు సులభంగా మంజూరు చేయడం వల్లే రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినట్లు నివేదికలో తేల్చారు. రాష్ట్రంలో 5జీ కూడా త్వరగా అభివృద్ధి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు ఇతర పాలసీలు రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ పెరగడానికి కారణం అయ్యాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడించారు.

ఇక ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉన్న మహిళల సంఖ్య కూడా రాష్ట్రంలో భారీగానే ఉన్నది. దేశంలో మహిళా ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్లలో తెలంగాణ టాప్-5లో ఒకటిగా ఉన్నది. మహిళలు వారి సొంత అవసరాల కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. దేశంలోని 6,44,131 గ్రామాలకు గాను 6,05,230 గ్రామాలకు ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. 

Tags:    
Advertisement

Similar News