ఆస్తుల కేసులో జగన్‌కు భారీ ఊరట

జగన్‌, విజయసాయిరెడ్డి కేసులో తొలుత సీబీఐ చార్జిషీట్లపైనే విచారణ జరపాలని, ఒకవేళ అవి నిరూపితం కాకపోతే ఇక ఈడీ కేసే ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆస్తుల కేసులో నిందితులకు అతి పెద్ద ఊరటగా చెప్పవచ్చు.

Advertisement
Update:2022-09-09 08:24 IST

జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు పక్కనపెట్టేసింది. ఆస్తుల కేసులో తొలుత ఈడీ కేసులపైనే విచారణ జరగాలని గతంలో సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగానే ఈడీ కేసులు నమోదు చేసిందని, ఒకవేళ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో నిజం లేదని తేలితే అసలు కేసే ఉండదని.. కాబట్టి ఈడీ కేసులకు మూలమైన సీబీఐ చార్జిషీట్లపైనే తొలుత విచారణ జరిగేలా చూడాలని నిందితులు కోరినా సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు తొలుత తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు పిటిషన్ వేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం కూడా సీబీఐ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. తొలుత ఈడీ కేసులనే విచారించవచ్చని తీర్పు ఇచ్చింది. దీనిపై నిందితులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. వీరి పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ ధర్మాసనం.. సీబీఐ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది.

విజయ్‌ మదన్‌లాల్ చౌదరి కేసులో.. ఈడీ కేసులకు మూలమైన సీబీఐ కేసులపైనే తొలుత విచారణ జరగాలని సుప్రీంకోర్టు చెప్పిన అంశాన్ని సీజే ప్రస్తావించారు. కేసులకు మూలమైన సీబీఐ చార్జిషీట్లనే కోర్టులు కొట్టివేసిన తర్వాత అసలు నేరం జరిగిందనడానికి అవకాశం ఉండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాబట్టి తొలుత సీబీఐ కేసులనే విచారించాల్సి ఉంటుందని.. సుప్రీంకోర్టు దీనిపై స్పష్టత ఇచ్చినందున దిగువ కోర్టులన్నీ తప్పకుండా దీన్ని ఫాలో కావాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

కాబట్టి జగన్‌, విజయసాయిరెడ్డి కేసులో తొలుత సీబీఐ చార్జిషీట్లపైనే విచారణ జరపాలని, ఒకవేళ అవి నిరూపితం కాకపోతే ఇక ఈడీ కేసే ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆస్తుల కేసులో నిందితులకు అతి పెద్ద ఊరటగా చెప్పవచ్చు. తొలుత ఈడీ కేసులను విచారించి ఉంటే.. చిన్నచిన్న లొసుగులకూ కఠిన శిక్షలు పడి ఉండేవి. ఈడీ కేసులతో పాటు ఆ తర్వాత సీబీఐ కేసులనూ ఎదుర్కొవాల్సి ఉండేది. ఇప్పుడు సీబీఐ కేసులను తొలుత విచారిస్తే.. అందులో నేరం నిరూపితం కాకపోతే ఈడీ కేసులూ ఆటోమెటిక్‌గా తొలగిపోతాయి.

Tags:    
Advertisement

Similar News