సీఎస్ సోమేష్ కుమార్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
క్యాడర్ కేటాయింపు అధికారం కేంద్రానికే ఉంటుందని.. సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని కేంద్రం వాదించింది. ఈ కేసు విచారణను పూర్తి చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది.
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే సోమేష్ కుమార్ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు తీర్పు అమలుకు మూడు వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీ క్యాడర్‌కు కేటాయించింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సోమేష్ కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. తనను ఏపీ క్యాడర్‌కు కేటాయించే సమయంలో సరైన విధానాలను అనుసరించలేదని.. తనను తెలంగాణలోనే కొనసాగించాలని కోరారు. సోమేష్ విజ్ఞప్తి స్వీకరించిన క్యాట్ ఆయన్ను తెలంగాణలోనే కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎనిమిదేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసిన సోమేష్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. క్యాట్ ఉత్తర్వులను 2017లో కేంద్రం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది.
క్యాడర్ కేటాయింపు అధికారం కేంద్రానికే ఉంటుందని.. సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని కేంద్రం వాదించింది. ఈ కేసు విచారణను పూర్తి చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని తీర్పునిచ్చింది. అయితే తీర్పును తాము సవాల్ చేయాలనుకుంటున్నామని.. కాబట్టి తీర్పు అమలును తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. తీర్పు అమలును మూడు వారాల పాటు వాయిదా వేసింది.