తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ రద్దు

గ్రూప్-1 పరీక్ష పదే పదే రద్దవుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Update:2023-09-23 12:05 IST

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయ్యింది. జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పరీక్షను మరోసారి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది. 503 పోస్టుల భర్తీ కోసం జూన్ 11న నిర్వహించిన పరీక్షకు 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పుడు పరీక్ష రద్దుతో వీరందరూ ఆందోళన చెందుతున్నారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సమయంలో బయో మెట్రిక్ వివరాలు తీసుకోలేదంటూ.. పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొంత మంది హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పరీక్షను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.

పేపర్ లీకేజీ కారణంగా అక్టోబర్ 16, 2022న నిర్వహించిన గ్రూప్ 1 ప్రలిమ్స్ పరీక్ష మార్చి 2023 నెలలో రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించిది. అభ్యర్థులు మరో సారి అప్లయ్ చేసుకునే అవసరం లేకుండా.. గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 11న రెండో సారి గ్రూప్-1 పరీక్షను నిర్వహించారు. తాజాగా, పలు కారణాలతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో.. పరీక్ష రద్దుకు ఆదేశాలు ఇచ్చారు.

గ్రూప్-1 పరీక్ష పదే పదే రద్దవుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రాశామని.. ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ కొంత మంది గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నారని.. ఇప్పుడు మరో సారి రద్దు కారణంతో వాళ్లంతా ఒక్కసారిగా షాక్ గురయినట్లు చెప్పారు. మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా.. మరోసారి ప్రిలిమ్స్ రాయాల్సి రావడం చాలా ఇబ్బందికరంగా మారుతోందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా సాధ్యమైనంత త్వరగా గ్రూప్-1 పరీక్షను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 

Tags:    
Advertisement

Similar News