తెలంగాణ గ్రూప్-1.. మూడోసారి రాయాల్సిందేనా..?

సుప్రీం అనుమతిస్తే మాత్రం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్ అవుతుంది. అంటే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ రాయాలన్నమాట.

Advertisement
Update:2024-02-12 07:01 IST

తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షను ఇప్పటికే రెండుసార్లు రాశారు. మూడోసారి కూడా వారు అదే పరీక్ష రాయాల్సి వచ్చేలా ఉంది. గ్రూప్-1 కి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలనుకుంటోంది. ఈనెల 8న అర్జీ కూడా దాఖలు చేసింది. సుప్రీం అనుమతిస్తే మాత్రం ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్ అవుతుంది. అంటే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ రాయాలన్నమాట.

గందరగోళం ఎందుకు..?

2022 ఏప్రిల్‌ లో ఈ కథ మొదలైంది. 503 పోస్టులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2022అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆ పరీక్షను TSPSC రద్దు చేసింది. తిరిగి అదే నోటిఫికేషన్ కోసం 2023 జూన్‌ 11 రెండోసారి పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని, పరీక్ష రోజు బయోమెట్రిక్‌ తీసుకోలేదని కొందరు అభ్యర్థులు మళ్లీ కోర్టుకెక్కారు. ఈసారి తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది, ఫలితం లేదు. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కానీ ఇంతవరకు కేసు తేలలేదు. ఈ దశలో ఇక్కడ ప్రభుత్వం మారింది. కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వడానికి పాత కేసు అడ్డుగా వస్తోంది. పోనీ ఆ కేసు తేలేవరకు వేచి చూడాలంటే ఇక్కడ యువత నుంచి ఒత్తిడి తట్టుకోవడం కష్టం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ హయాంలో సుప్రీంకోర్టు లో వేసిన పిటిషన్ ని వెనక్కు తీసుకోవాలనుకుంటోంది. TSPSC ద్వారా వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోడానికి సిద్ధపడింది. ఈ ఉపసంహరణ పిటిషన్ పై ఈనెల 19న విచారణ జరిగే అవకాశముంది. సుప్రీం అనుమతిస్తే తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ కి రెడీ అవ్వాలన్నమాట.

కొత్త పోస్ట్ లు..

ఒకే నోటిఫికేషన్ కి సంబంధించి మూడుసార్లు పరీక్షలంటే యువతలో తీవ్ర అసంతృప్తి ఖాయం. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పోస్ట్ లను కూడా ఇందులో కలిపే అవకాశముంది. అయితే పూర్తిగా పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారా, లేక అదనంగా గుర్తించిన 60 ఉద్యోగాలను కలిపి మొత్తం 563 పోస్ట్ లతో నోటిఫికేషన్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. కొత్త నోటిఫికేషన్ ఇస్తే సిలబస్ కూడా మారే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News