న్యూయార్క్‌లోనే కాదు.. ఇక హైదరాబాద్‌లోనూ టైమ్స్ స్క్వేర్!
ఇక్కడి కమ్యూనిటీకి సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కట్టడం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం.
హైదరాబాద్ పేరు చెప్పగానే గోల్కొండ, చార్మినార్ పేర్లు మనకు గుర్తొస్తాయి. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేబుల్ బ్రిడ్జి, సెక్రటేరియట్, అమరవీరులస్తూపం, పోలీస్ కమాండ్ కంట్రోల్, అంబేడ్కర్ విగ్రహం లాంటి అనేక ఐకానిక్ కట్టడాలు నిర్మించింది. అయితే రేవంత్ సర్కార్ సైతం హైదరాబాద్‌లో తన మార్క్ కనపడేలా ఓ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ తరహాలోనే ఓ ఐకానిక్ ప్లేస్‌ను హైదరాబాద్ రాయదుర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలోనే టీ - స్క్వేర్ నిర్మించాలని డిసైడ్ అయింది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) టెండర్లు ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక్కడి కమ్యూనిటీకి సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కట్టడం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. రాయదుర్గం ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఇంకా సౌకర్యాల కొరత ఉంది. దీంతో T-స్క్వేర్‌ను కమ్యూనికేషన్, రిలాక్సేషన్, సెలెబ్రేషన్స్ కు వేదికగా మార్చాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
టి-స్క్వేర్ నిర్మాణ ప్రకటన నగరవాసుల్లో ఆసక్తిని పెంచింది. ఈ ప్రాజెక్టు నగరానికి కొత్త అందాన్ని తీసుకురావడమే కాకుండా పర్యాటక, వాణిజ్య పరంగా నగరం మరింత అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.